17, డిసెంబర్ 2014, బుధవారం

9. కారాలూ రేఫలూ.

[ బహుజనపల్లివారి  ప్రౌఢవ్యాకరణం సంజ్ఞాపరిఛ్ఛేదం.  సూత్రం - 2 , సూత్రం - 3 ]



నిర్దేశ విధానోఛ్ఛారణంబులం దఱచుగ 'అ' వర్ణాదులు కార ప్రత్యయాంతములును, 'ర' వర్ణ మిఫప్రత్యయాంతము నగు 
[ప్రౌఢ. సం. 2]

ఉ. అకారమునకు ఉకారము వచ్చును, కకారమునకు గకారము వచ్చును. లకారమునకు రేఫము వచ్చును. మొదలైనవి. అకారము, ఇకారము, ఉకారము, ఱకారము, రేఫము మొదలైనవి తఱచుగ ననుటచేఁ గేవల ముఛ్ఛారణమునం దీవిధి నిత్యముగాదని తెలియునది.

నిర్దేశం, విధానం అంటే ఏమిటో చూదాం. ఇది ఫలానాది మారుతున్నది  అని సూచించి చెప్పటం నిర్దేశం అన్నమాట. ఫలాని సందర్భంలో కకారం పోయు గకారం వస్తుంది అన్నాం అనుకోండి. అక్కడ కకారం అని నిర్దేశించి చెప్పింది క అనే‌ హల్లు గురించి సూచించటానికి. అలాగే విధానం అంటే నిర్దేశించబడినదానికి బదులు విధిగా ఏదైతే వస్తోందో అది విధానం అన్నమాట, ఇక్కడ  గ అనే హల్లును సూచించటానికి చెప్పింది విధానం అని అర్థం చేసుకోవాలి. ఇలా క, గ అనే హల్లుల గురించి చెప్పేటప్పుడు 'నిర్దేశించబడిన క' బదులు 'గ అనేది విదించ బడుతోంది', అనేటప్పుడు కకారం గకారం  అని వాడుక చేస్తాం అని ఈ సూత్రం లోకవ్యవహారాన్ని వ్యాకరణ బధ్ధం చేసి చెబుతోంది.

అలాగే కకార ఉకారముల కు అని చదివించటం చూసి ఉంటారు. ఇక్కడ క ఉ లను ఉఛ్ఛరించటానికి ఊతంగా కకార,ఉకార అనే మాటలు వాడుతున్నారు.

తరచుగా అన్న మాట చెప్పారు బహుజనపల్లివారు. అంటె హెచ్చుగా ఇలా వాడుతూ ఉంటాం కాని ఇలా వాడకుందా క + ఉ = కు అంటూ కార ప్రత్యయం చెప్పకుండానూ వివరించటం వంటివి కూడా జహజమే తెలుగులో అని చెబుతున్నారు. వాటి గురించి మరో రెండు సూత్రాలూ చెప్పారు.

ఒక్క 'ర' అన్నదానిని మాత్రం రకారం అని పిలవరు. రేఫము అనే అంటారు. సంస్కృత వ్యాకరణంలో కూడా వర్ణాత్కారః రస్యేఫః అని చెబుతారు. అంటే ఒక్క 'ర'కు మాత్రం రేఫం అని వ్యవహారం. మిగతా అన్ని వర్ణాలకూ కారం అని చేర్చివాడాలి అని సంస్కృతంలోనూ పధ్ధతి ఉందన్నమాట.

ఒక్క విషయం గమనించాలి. 'ర' ని రేఫం అంటాం కాని 'ఱ'ని మాత్రం ఱకారం అనే అంటారు.

మరొక విషయం. నిర్దేశం అని అంటే సరిపోయేదే కాని సూత్రంలో మరింత స్పష్టత కోసమే బహుజనపల్లివారు విధాన, ఉఛ్ఛారణాల్నీ ప్రత్యేకంగా చెప్పారు.


ఒకచో హ్రస్వంబు దీర్ఘంబగు
[ప్రౌఢ. సం. ౩]
నిర్దేశ విధానంబులం గార రేఫ ప్రత్యయములు రాని యెడల హ్రస్వమునకు దీర్ఘము వచ్చునని యర్థము. ఉ॥ 'ఆ'కు 'ఊ' వచ్చును, 'కా'కు 'గా' వచ్చును, 'లా'కు 'రా' వచ్చును.

అంటే 'అ'కారమునకు 'ఉ' కారము వచ్చును అనటానికి బదులుగా 'ఆ'కు 'ఊ' వచ్చును అని కూడా అనటం వ్యవహారంలో ఉంది అని చెప్పటం బహుజనపల్లివారి ఉద్దేశం. ఇలా   'ఆ'కు 'ఊ' వచ్చును అని చెప్పినపుడు అందులో ఉన్న 'ఆ', 'ఊ'లు నిజానికి 'అ' ' ఉ' లే. 

ఈ విషయం సంస్కృతవ్యాకరణంలో కూడా దీర్ఘంస్యాత్ వర్ణనిర్దేశే అని ఒక సూత్రం ఉంది. ఇది దానికి తెలుగు సేత అన్నమాట.


దీర్ఘంబు దీర్ఘంబ
[ప్రౌఢ. సం.  4]
నిర్దేశవిధానవిషయములైన వర్ణములు దీర్ఘములయ్యెనేని యవి యట్లే యుండునని యర్థము. ఉ॥ ఐ కి ఔ వచ్చును మొదలైనవి.

రెండవసూత్రం ప్రకారం అకారం, టకారం వంటి మాటల వ్యవహారంలోని కార ప్రత్యయాన్ని గురించి ఒక సూత్రం చెప్పారు. ఆ వెంటనే మరొక సూత్రంలో ఈ‌ కార ప్రత్యయం బదులు వర్ణాన్ని దీర్ఘంతీసి చెప్పతమూ ఒక వ్యవహారంగా ఉంది అని చెప్పారు.

ఈ సూత్రంలో పొట్టి అక్షరాలకు దీర్ఘం రావటం ఉంది అని చెప్పారు కదా, మరి పొడుగు అక్షరాలు (దీర్ఘాక్షరాలు) ఐ, ఏ, ఔ వంటి వాటి సంగతి ఏమిటీ అన్న ప్రశ్న వేస్తారేమో ఎవరన్నా అని అలోచించి దానికీ‌ ఒక సూత్రం చెప్పారు. అబ్బే వాటిలో ఏ మార్పూ ఉండదూ అని. 

నిజానికి ఈ సూత్రం అనవసరమే. కాని చెప్పే విషయం సమగ్రంగా చెప్పాలని బహుజనపల్లివారి ఆలోచన అన్నమాట.

14, డిసెంబర్ 2014, ఆదివారం

8. వర్ణాలంటే అక్షరాలేనా, బేధం ఏమన్నా ఉందా?

వర్ణాలూ అక్షరాలూ ఒకటేనా వేరువేరా అన్నది చాలా ఉచితమైన ప్రశ్న.

ఇప్పటికే  శ్రీ జై గొట్టిముక్కల వారు అడిగారు కూడా వర్ణాలు అక్షరాలూ ఒకటేనా? కాకపొతే తేడా కాస్త విపులంగా చెప్పగలరా? అని. దానికి నేను సమాధానం చెప్పటం జరిగింది.

కాని ఈ ప్రశ్నోత్తరాలు రెండూ ఒక టపాకు వ్యాఖ్యలుగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా వాటిని గమనించకపోయే అవకాశం కూడా ఉంది. ఐనా నిజానికి వ్యాఖ్యలను చూసి బ్లాగు టపాల వద్దకు చదువరులు రావటం అంతకంటే సహజం. ఒక వేళ ఎవరూ అందరూ ప్రశ్నోత్తరాలను గమనించినా, ఈ ప్రశ్నకు కొంచెం విస్తృతంగా జవాబును చెప్పుకొనే అవకాశం ఉంది కాబట్టి ఒక పూర్తి నిడివి టపాగా వ్రాయాలన్న ఆలోచన కలిగింది.  అలా చేస్తే చదువరులకు సంగతి సంధర్భాలు సమగ్రంగా బోదపడేందుకు చక్కని వీలు కలుగుతుందన్నది నా ఊహ.

భారతీయమైన సనాతన భావనాస్రవంతిలో శబ్దము బ్రహ్మము అని చెప్పబడుతుంది. ముందుగా ఈ విషయంలో కొంత వివేచన చేయటం అవసరం.

భర్తృహరి వాక్యపదీయంలోని బ్రహ్మకాండలో,

అనాది నిధనం, బ్రహ్మశబ్ద తత్త్వం యదక్షరమ్
వివర్తతేర్థభావేన ప్రక్తియా జగతో యతః

అని చెప్పాడు. అంటే సకలప్రపంచం యొక్క వ్యవహారమూ దేనివల్ల కలుగుతోందో, ఆ అర్థ-భావాలని ప్రపంచంలొ వ్యాపించచేసేది శబ్ద తత్త్వం. ఆ శబ్దతత్త్వం కేవలం బ్రహ్మమే. అది నాశనము లేనిది. గుణములూ రూపములు అనేవాటితో ప్రకృతి యేర్పడింది. ఆ ప్రకృతికి మూలం‌ బ్రహ్మమే. అదే ఆ ప్రపంచంలో వ్యవహారాలు జరిగేటందుకు గాను శబ్దం అనే తత్త్వంగా వ్యాపించి ఉంది.

సంస్కృతభాషకు ప్రామాణికి వ్యాకరణం రచించిన పాణిని మహర్షి తన వ్యాకరణగ్రంథం అష్టాధ్యాయిలో ఈ‌ శబ్దము బ్రహ్మమే అన్న సిధ్ధాంతాన్ని వ్యక్తీకరించారు.

మహర్షి పతంజలి పాణిని వ్యాకరణానికి ఒక గొప్ప భాష్యగ్రంథాన్ని రచించారు. దానికి మహాభాష్యం అని పేరు. పతంజలి మహర్షి ఆదిశేషుడి అవతారమని ప్రతీతి.  ఆయన రచించిన ఆ మహాభాష్యంలో ఈ శబ్దము అనేది బ్రహ్మమే అని నొక్కి వక్కాణించాడు. ఆయన,  ప్రతిమండితో‌ బ్రహ్మరాశిః అంటూ, వర్ణసమామ్నాయం అంతా బ్రహ్మమే అని నిర్దారించారు.  కిం పునర్నిత్యః శబ్దః ఆహాస్విత్ కార్యః అని నిత్యమూ సకలకార్యాల నిర్వహణకూ ఆధారమైన ఈ శబ్దతత్త్వము బ్రహ్మమే అన్నారు.

బ్రహ్మ సూత్రాల్లో కూడా ఈ‌క్షతేర్నాఽశబ్దం అని చెప్పబడింది.

యత్కించిత్ నాదరూపేణ శ్రూయతే శక్తిరేవచ
యస్తత్వాంతో నిరాకారాః స ఏవ పరమేశ్వరః

కేవలం శ్రోత్రేంద్రియానికి గోచరంగా ఉంటూ ఒక ఆకారం లేనిదీ నాదరూపంలో ప్రత్యక్షమాణం అవుతున్నదీ ఏదైతే ఉందో ఆ శక్తిస్వరూపం కేవలం పరమేశ్వరుడే అని దీని తాత్పర్యం.

చైతన్యం సర్వభూతానాం శబ్దబ్రహ్మేతిమే మతిః అని శారదాతిలకం.

ఈ విధంగా భారతీయమైన దృక్పధంలో శబ్దం అనేది బ్రహ్మస్వరూపంగా అర్థం చేసుకోవలసి ఉంది.  ఈ శబ్దం పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అని నాలుగు విధాలుగా ఉంటుంది.

శబ్దానికి ఇఛ్ఛ మూలం.  అదే దాని 'పర' అవస్థ.. ప్రపంచోన్ముఖంగా అంటే లోనుండి బయటకు రావటాఅనికి ప్రయత్నరూపంలో ఉన్న శబ్దానిది 'పశ్యంతి; అవస్థ, వాగ్రూపం ధరిస్తున్న శబ్దం 'మధ్యమ' అనే అవస్థలో‌ ఉంటుంది. వర్ణములు స్థూలాకృతి కలవి.  ఇలా వర్ణాల రూపంలో ఉండటం, శబ్దానికి వైఖరీ అవస్థ. దీనివలన వాక్కు క్రియాశీలంగా ఉండటం వల్లనే ప్రపంచవ్యవహారాలు నడుస్తున్నాయి.

ఈ విధంగా శబ్దం ధ్వనిరూపంగా వైఖరీస్థితిలో ప్రపంచంలో వ్యాప్తి చెందుతోంది. అప్పుడే మనకి మాటలూ వాటి అర్థాలూ అన్న గ్రహింపుకు వస్తున్నాయి.  ఇలా ఈ ప్రపంచవ్యవహారం వర్ణాత్మకం అవుతోంది,

ఈ శబ్దము అనే బ్రహ్మము వైఖరీ అవస్థలో వివిధమైన వర్ణాలుగా కనిపిస్తోందని చెప్పుకున్నాం‌ కదా. ఆ వర్ణములే వర్ణమాలలో ఉన్న వర్ణాలు. అంటే వర్ణమాలలో ఉన్న ఒక్కక్కొ వర్ణమూ ఒక్కొక్క శబ్దవిశేషం అన్నమాట.

ఈ వర్ణాలని గురించి శాస్త్రంలో విషృతంగా ఉంది కాని మనం కొంచెంగానే పరిశీలిధ్దాం.  లలితా సహస్రనామస్తోత్రంలో 'ఆదిక్షాంత సమస్తవర్ణజననీ' అని ఒక మంత్రం ఉంది.  (అక్కడి నామా లన్నీ‌ మంత్రాలే. అది వేరే విషయం).  అంటే అకారం నుండి క్షకారం వరకూ అన్ని వర్ణాలకూ అమ్మ మాతృమూర్తి అని చెబుతున్నదీ మంత్రం.  ఇక్కడ మనకి ఆసక్తి ఉన్న విషయం అకారం నుండి క్షకారం వరకూ అన్నీ వర్ణములు అన్న తెలివిడి.

సరే ఇప్పుడు వర్ణము అంటె శబ్దము యొక్క నిర్దిష్టమైన అభివ్యక్తీకరణ అని తెలిసింది. ఎన్ని రకాల వ్యక్తీక్రరణలు ఉన్నాయో అన్ని వర్ణములు ఉన్నాయి.

అక్షరం అనేది ఏమిటి అన్నదానికి సమాధానం సులభమే. అది ఇప్పటికే చెప్పాను. వర్ణము యొక్క లిఖితస్వరూపం అక్షరం.  నిజానికి యిది నూటికి నూరుపాళ్ళూ సంతృప్తికరమైన నిర్వచనం కాదు కాని వ్యవహారానికి సరిపోయే నిర్వచనం. నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే అక్షరం అన్నది వర్ణము యొక్క స్వభావం. వర్ణము శాశ్వతమైనది అన్న భావనతో వర్ణాలను అక్షరాలు అన్నారు.  అక్షరము అంటే క్షరము (నాశనము)‌లేనిది అని అర్థం కాబట్టి అలా చెప్పారు. స్థూలంగా కంటికి కనిపించే స్వరూపంలో అక్షరం అని వినిపించే స్వరూపంలో వర్ణము అని అంటే సరిగా ఉంటుంది.  అంటే ప్రతివర్ణం యొక్క వ్యక్తీకరణకీ ఒక రూపం ఆపాదిస్తే అది ఆ వర్ణానికి అక్షరం అన్నమాట.

వచ్చే ఒకటి రెండు టపాల్లో వర్ణమాలలో ఉన్న ఋ ౠ ఌ ౡ లకు సంబంధించీ, క్ష అనేదాని ప్రతిపత్తికి సంబంధించీ వివరంగా తెలుసుకుందం. ఈ మధ్యకాలంలో కొందరు ఋ, ౠ, ఌ, ౡ లను వర్ణమాల నుంచి తీసెయ్యాలని గడబిడ చేస్తున్నారు. అలాగే క్ష అనేది వర్ణమాలలో ఉందని కూడా కొందరు వాదిస్తున్నారు.  ఈ వాదనలను శాస్త్రీయంగా పరిశీలించి ముందుకు కదులుదాం.  ఒక్క విషయం శాస్త్రీయంగా అంటే సంప్రదాయిక వ్యాకరనాది శాస్త్రాల ఆధారంగానే అని నా ఉద్దేశంగా గ్రహించండి.

12, డిసెంబర్ 2014, శుక్రవారం

7. తాలవ్య దంత్య చజ లను గురించి మరికొన్ని విషయాలు.

[పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం.  సంజ్ఞాపరిఛ్ఛేదం.  సూత్రం - 8, సూత్రం‌ - 9, సూత్రం - 10 ]

ఇ ఈ ఎ ఏలం గూడిన చజలు తాలవ్యంబులు (8)

చిలుక, చీమ, చెవి, చెలి, చేమ, జిల, జీడి, జెఱ్ఱి, జేజె

 చ జ గుణింతాలతో ఉన్న మాటల్లో అ చ జ లకు ఇ,ఈ లేదా ఎ,ఏ గుణింతం ఉంటే ఆ చ జ లు తాలవ్యాలే కాని దంతవ్యాలు (ౘ, ౙ) కావు అన్నది భావం. చిన్నయసూరిగారు చ వర్ణానికి ఇక్కడ ఉదాహరణలుగా చి- చిలుక, చీ- చీమ, చె - చెవి, చే- చేమ అన్న మాటలు చూపారు. అలాగే జ వర్ణానికి ఉదాహరణలుగా జి- జిల, జీ- జీడి, జె- జెఱ్ఱి, జే- జేజె అన్నవి ఇచ్చారు.


అ ఆ ఉ ఊ ఒ ఓ ఔలం గూడిన చజలు దంతవ్యంబులు (9)

ౘలి, ౘాప, ౘుక్క, ౘొక్కు, ౘోటు, ౘౌక, ౙముడు, ౙాతర, ౙున్ను, ౙూలు, ౙొన్న, ౙోలి, ౙౌకు. 
ఐదంతంబులయిన చజలు సమేతరశబ్దంబులందు లేవు.

అచ్చుల్లో కొన్నింటి ఆధారంగా చ జలకు తాలవ్యతను చూసాంకదా 8వ /సూత్రంలో, ఇప్పుడు మిగిలిన అచ్చుల గురించి చెబుతున్నారు. అ, ఆ, ఉ, ఊ, ఒ, ఓ, ఔలతో కనక చ జల గుణింతం వచ్చిన మాటలు దంత్యాలు అన్నారు.  ఈ సూత్రం పై 8వ సూత్రానికి కొనసాగింపు. కాని ముఖ్యమైన బేధమూ ఉంది. ఈ సూత్రం అచ్చతెలుగు మాటలకే వర్తిస్తుంది కాని సం స్కృతసమమైన పదాలకూ ఈ సూత్రం వర్తించదు.

ఇక్కడ కూడా దంత్యాలైన ౘకార, ౙకారలకు కొన్ని ఉదాహరణలను సూరిగారు చూపించారు.

అచ్చులన్నీ చెప్పారు కానీ , మరి ఐ గుణింతాల సంగతి యేమీటీ అంటే ఐకారంతో కూడుకున్న మాటలు తెలుగులో లేవు అనేసారు.

మీరు చైత్రము లేదా అనవచ్చును. లేదు లేదు. చైత్రము అనేది చైత్రః అన్న సంస్కృతపదానికి తెలుగు.
అలాగే జైత్రయాత్ర జైనమతము వంటి వన్నీ కూడా సంస్కృతపదాలకు తెలుగుమాటలే.
కాబట్టి ఎక్కడన్నా మనకి చై అన్న వర్ణం కనిపించితే అది సంస్కృతపదమే అన్నది బండగుర్తుగా పెటుకోవచ్చును.

సంస్కృత సమంబులం దికారాంతంబులయిన శబ్దంబుల యుపధా  చజలు బహువచనంబు పరంబగునపుడు దంత్యంబులగును (10)

ఇవి దప్ప సంస్కృతసమంబులందు దంత్యచజలు లేవని తాత్పర్యము. 

అర్చి అర్ౘులు, రోచి, రోౘులు, వీచి, వీౘులు, రాజి, రాౙులు, వాజి, వాౙులు

మఱియు రాజు శబ్దంబొక్కటి దంత్యయుక్తంబు కానంబడియెడి.

ఇతరములయిన చజల కుదాహరణంబులు. చంద్రుఁడు, చుక్రిక, చూర్ణము, చోరుడు, చౌర్యము, జయము, జాతి, జుగుప్స, జూటము ఇత్యాదులు.

ఈ సూత్రంలో కొన్ని ముఖ్యమైన విశేషాలున్నాయి.

మొదటగా గమనించవలసింది, ఈ సూత్రం సంస్కృతసమములైన మాటలకు వర్తించేది. అచ్చతెలుగు మాటలకు కాదు.

రెండవది ఉపధ అన్న పారిభాషిక పదం. ఉపధ అంటే పదంలో ఆఖరు వర్ణానికు ముందు వచ్చే వర్ణం.

అర్చి అన్నది సంస్కృతం నుండి తెలుగులోనికి వచ్చిన పదం.  ఈ పదంలో చిట్టచివరి వర్ణం ఇకారం. ఎందుకంటే ఇందులో వర్ణాల క్రమం అ + ర్ + చ్ + ఇ అన్నది. ఇక్కడ చివరి వర్ణం ఇ అయింది. అలాగే దానికి ముందున్న వర్ణం చ. ( అసలు వర్ణం చ్ అనే కాని పలకటంలో సులువు కోసం అకారం చేర్చి పలుకుతారు చ్ + అ => చ అని, అది సమ్మతమే). ఇలా ఈ సూత్రంలో ఉన్న రెండు షరతులూ సరిపోయాయి.

అర్చి అన్నప్పుడు ఏకవచనమే, అందులో వచ్చే మార్పు ఏమీ ఈ సూత్రం చెప్పటం లేదు.
ఇప్పుడు ఈ అర్చి కి బహువచనం ఐన పదం తెలుగులో అర్చి + లు కదా,

ఇప్పుడు ఈ అర్చిలో ఉన్న వర్ణాల్లో మార్పు వస్తుంది

అ + ర్ + చ్ + ఇ + లు   అన్నది  అ + ర్ + ౘ్ + ఇ + లు అని మారి పోతుంది ఈ సూత్రం ప్రకారం.

ముందుముందు రాబోయే వేరే సూత్రాన్ని అనుసరించి, ఈ పదంలోని ఇ కాస్తా ఉ గా మారుతుంది. అంటే,

అ + ర్ + ౘ్ + ఇ + లు అన్నది అ + ర్ + ౘ్ + ఉ + లు గా మారుతుంది.

ఇప్పుడు వర్ణాలను పదంగా కలిపి రాస్తే అర్ౘులు అవుతుంది.

ఇలా సూరిగారు ఇచ్చిన పట్టికలోని పదాలన్నింటికీ సాధన చేయవచ్చును ఈ సూత్రంతో.

  1. అర్చి + లు => అర్ౘులు
  2. రోచి + లు  => రోౘులు
  3. వీచి + లు  =>  వీౘులు
  4. రాజి + లు  => రాౙులు
  5. వాజి + లు  => వాౙులు

ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే ఈ పదాలు తప్ప సంస్కృతంలో దంత్య చజలు (ౘ,ౙ) లేవు!

సూరిగారు జొ, జోలతో కూడిన సంస్కృతపదాలను ఉదాహరణల్లో ఇవ్వలేదు. వీటికి సంస్కృతంలో ప్రసిధ్ధపదాలు లేకపోవటమే కారణం.

10, డిసెంబర్ 2014, బుధవారం

6. పరుషాలూ సరళాలూ స్థిరాలూ అని హల్లులు మూడు రకాలు.

 [పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం.  సంజ్ఞాపరిఛ్ఛేదం.  సూత్రం - 4, సూత్రం‌ - 6, సూత్రం - 7 ]


క చ ట త ప లు పరుషంబులని గ జ డ ద బ లు సరళంబులని చెప్పంబడు

హల్లులలో  క చ ట త ప లని పరుషాలు అంటారు.
హల్లులలో గ జ డ ద బ లని సరళాలు అంటారు.

కచటతపః పరుషాఖ్యాః గజడదబాస్తు సరళాః అని ఆంధ్రశబ్ద చింతామణి.

కచటతపలను ఉఛ్ఛరించటంలోనూ గజడదబలను ఉఛ్ఛరించటంలోనూ ఉన్న శబ్దమార్దవ బేధాన్ని అనుసరించి వీటిని పరుషాలూ సరళాలూ అని వర్గీకరించారు.

చకారం జకారం అనేవి తాలవ్యమూ దంతవ్యమూ అని రెండురకాలుగా ఉన్నాయి. ఆ విషయం ముందు ముందు ఏడవ సూత్రంలో తెలుసుకుందాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే తాలవ్యదంతవ్య బేధం అనేది ఈ వర్గీకరణకు సంబంధించి లెక్కలోకి రాదు అని.

ఇతరములగు హల్లులుస్థిరములు

పరుషాలూ సరళాలూ పోను మిగిలిన హల్లులన్నింటికీ స్థిరములు అని పేరు.
సూరి గారు వాటిని స్పష్టంగా లిష్టు వేసి మరీ ఇచ్చారు.
ఖ ఘ ఙ , ఛ ఝ ఞ, ఠ ఢ ణ,  థ ధ న, ఫ భ మ,  య ర ల వ శ ష స హ ళ

ఇప్పుడు మనం పరుషాలూ,  సరళాలూ,  స్థిరాలూ పట్టికలలో చూదాం. (రంగులు గుర్తుపట్తటంలో సౌలభ్యం కోసం)

ఙ 
చ ౘజ ౙ



ఇలా మొత్తం 36 హల్లుల్లో 5+1 పరుషాలు, 5+1 సరళాలూ ఉందగా మిగిలిన 24 హల్లులూ  స్థిరాలు.

దంత్య తాలవ్యంబు లయిన చజలు సవర్ణంబులు


దంత్యమైనా తాలవ్యమైనా చకారం పరుమే.  దంత్యమైనా తాలవ్యమైనా జకారం సరళమే.

సూరిగారు ఇలా విశదీకరించారు.

తాలవ్యచకారంబు దంత్యచకారంబునకును దాలవ్య జకారంబు దంత్యజకారంబునకును గ్రాహకంబులు

ముందు తాలవ్య దంతవ్యాలు చకార జకారాలు చూదాం

 తాలవ్యం
దంతవ్యం
చ 


తాలువు అంటే దవడ లోపలి భాగం. చ జ లనే‌వర్ణాలను ఉత్పత్తి చేసే స్థానం తాలువు అవుతున్నది కాబట్టి చ జ లను  తాలవ్యములు అన్నారు.

దంతము అంటే తెలిసిందే. ౘ ౙ లను పలకటానికి నాలుకను దంతాలకు ఆనించి వర్ణోత్పత్తి చేస్తాము కాబట్టి వీటిని దంతవ్యములు అన్నారు.

ఐతే ఈ నాలుగు వర్ణాలకు నాభ్యంతరమైన శబ్దోత్పత్తిప్రయత్నం సమానం కాబట్టి వ్యాకరణం ఇవి సవర్ణములు అంది. తుల్యాస్య ప్రయత్నమ్‌ సవర్ణం అని పాణిని వ్యాకరణం.

సూరిగారు ఈ‌ సూత్రంలో తాలవ్య దంతవ్యాలు పరస్పరం గ్రాహకములు అన్నారు కదా? అంటే ఏమిటీ అన్న ప్రశ్న ఉంది.  వ్యాక్రరణం చ కు ఏమి సూత్రాలను విధిస్తున్నదో అవన్నీ ౘ కూ సమానంగా వర్తిస్తాయనీ అలాగే జ కు ఏ వ్యాకరణ సూత్రాలు వర్తిస్తాయో అవన్నీ సమానంగా ౙ కు కూడా వర్తిస్తాయనీ అర్థం.

ఇక్కడ తాలవ్యములు దంతవ్యములు అన్న విభాగాన్ని బాగా గుర్తుంచుకోండి వచ్చే టపాలో దాని గురించి మరింత చెప్పుకోబోతున్నాం మరి.

9, డిసెంబర్ 2014, మంగళవారం

5. ఆంధ్రభాషకి 55 వర్ణాలున్నాయి.

[ప్రౌఢవ్యాకరణం. సంజ్ఞాపరిఛ్ఛేదం సూత్రం - 1]

ఆంధ్రభాషకు వర్ణంబు లేఁబదియైదు.

ఆంధ్రభాషకి 55 వర్ణాలున్నాయి.

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అఁ అః క ఖ గ ఘ ఙ చ ౘ ఛ జ ౙ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ

పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం ఆవిర్భవించిన తరువాత బహుజనపల్లి సీతారామాచార్యులుగారు ప్రౌఢవ్యాకరణం అని మరొక వ్యాకరణగ్రంథం వ్రాసారు. బాల వ్యాకరణంలో కొన్ని విషయాలలో అసమగ్రత ఉన్నదని భావించి ఆ లోటుపాట్లను పూర్తిచేయటానికి బహుజనపల్లివారు ప్రౌఢవ్యాకరణం వ్రాసారు. మనం వీలైన చోట్ల ఈ వ్యాకరణగ్రంథం నుండి కూడా నేర్చుకుందాం.
ఈ ప్రౌఢవ్యాకరణం లోని సూత్రం బాలవ్యాకరణం సంజ్ఞాపరిఛ్ఛేదంలో ఉన్న మూడవ, నాలుగవ సూత్రాల సమాహారం. అంటే ఆ సూత్రాల కలగలుపు అన్న మాట. మొత్తం వర్ణమాలను ఇక్కడ పట్టిల రూపంలో చూడండి.

అంఅఁఅః

ఙ 
చ ౘజ ౙ


ఈ‌ పట్టిక ప్రకారం తెలుగులో అచ్చులు 19.  హల్లులు 25 +2++ 9 = 36
అచ్చులూ హల్లులూ కలిపి మొత్తం వర్ణాలు 19 + 36 = 55

ఈ సూత్రానికి బహుజనపల్లివారి వివరణ ఈ విధంగా ఉంది.

1. ౡకార గ్రహణము సంస్కృత ప్రాకృత భాషా వ్య్తాకరణజ్ఞుల సమ్మతము. అయ్యది మంత్ర శాస్త్ర ప్రసిధ్ధము..
2. యవలల వలె రేఫంబును ప్రయత్నభేదంబుచే ద్వివిధంబు గాన శబ్దశాసనాదులచేత నలఘురేఫము వర్ణాంతరముగా గ్రహింపబడదయ్యె.
3. క్షకారము సంస్కృతవ్యాకరణముల యందును, నిఘంటువుల యందును, షాంతపద మధ్యమునందుఁ బఠింపఁబడుటం జేసి యది వర్ణాంతరము గాదు; సంయుక్తాక్షరమని తెలియవలయు. 


మనం క్రిందటి టపాలోనే ఈ క్రింద చెప్పిన మాటలు చదువుకున్నాం.

ౡ అనే ఏకాక్షరశబ్దం సంస్కృతంలో ఉంది కాని తెలుగులో లేదు. ఐటె దీనిని తెలుగు వర్ణమాలలో ఎందుకు చేర్చుకున్నట్లు అన్న ప్రశ్న వస్తుంది తప్పకుండా. ఈ ౡకారము సంసృత వ్యాకరణంలో ఉంది. ప్రాకృత వ్యాకరణం లోనూ‌ఉంది. ఈ వర్ణం కేవలం మంత్రశాస్త్రంలో తప్ప ప్రయోగంలో లేదు. అక్కడ అవసరం కాబట్టి సంస్కృతవర్ణమాలలో ఉంది.  కవులు కావ్యారంభంలో మాతృకాపూజచేయటానికి ఈశాన్యమూలను వ్రాయవలసిన అచ్చుల సమామ్నయంలో ఈ వర్ణమూ ఉంది కాబట్టి దీనికి సంస్కృతంలో ఉన్నట్లే తెలుగులో కూడా ఒక అక్షరరూపం ఇవ్వవలసి వచ్చింది. అంతకంటే ఈ వర్ణానికి విశేషప్రయోజనం ఏమీ లేదు.


య ర ల వ లను గురించి లఘువులూ  అలఘువులూ అని రెండు రకాలున్నాయి. వీటి గురించి బాలవ్యాకరణం 18వ సూత్రంలో వస్తుంది.  ఈ విషయం దృష్టిలో ఉంచుకొని వర్ణమాలలో శకటరేఫం అంటే నండి ఱ చేర్చలేదు. ఇది సూరి గారు కొత్తగా చేసిన వర్గీకరణం కాదు.  నన్నయగారు చేసినదే.

క్షకారం ఒక వర్ణం కాదు. సంయుక్తాక్షరం. బహుజనపల్లివారు క్షకారం ఎందుకు ప్రత్యేకమైన వర్ణంగా వర్ణమాలలో చేరదో చెప్పారు. (క్షకారం వర్ణమాలలో ఉందనే వాదన కూడా ఉంది.) 

వర్ణమాలలోని కొన్ని అక్షరాల గురించి విడిగా ఒక టపాలో చదువుకుందాం. ప్రస్తుతానికి వర్ణమాల ఎలా ఉన్నదని వ్యాకరణం చెబుతున్నదీ తెలుసుకుంటే చాలు.

8, డిసెంబర్ 2014, సోమవారం

4. తెలుగులో ప్రవేశించిన సంస్కృతవర్ణాలు.

[ పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం.  సంజ్ఞాపరిఛ్ఛేదం.  సూత్రం - 4 ]

ఋ ౠ ఌ ౡ విసర్గ ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ  ఙ ఞ శ ష  లు సంస్కృత సమంబులను గూడి తెలుగుఁన వ్యవహరింపంబడు


సంస్కృతంలోని ఋ ౠ ఌ ౡ  అనే అచ్చులూ, విసర్గ, ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ అనే మహాప్రాణాలు అనే హల్లులూ,  శ ష అనే ఊష్మాలూ తెలుగులో సంస్కృతపదాల వ్యవహారం ఏర్పడటం కారణంగా అదనంగా వచ్చిచేరాయి. ఇలా తెలుగులోనికి సంస్కృతం నుండి వచ్చి చేరిన వర్ణాల సంఖ్య 19

సూరిగారు ఉదాహరణలు కూడా ఇచ్చారు తెలుగులో సంస్కృతపదాల వాడుగ గురించి

ఋతువు, పి తృఆణము, కౢప్తము, ౡకారము,  దుఃఖము,  ఘటము,  ఛత్రము,  ఝురము,  కంఠము,  ఢక్క,  రథము,  ధరణి,  ఫణము,  భయము,  పఙ్క్తి,  ఆజ్ఞ,  శరము,  షండము

సంస్కృతంలో ఉన్న ఋతుః అన్న శబ్దమే తెలుగులో ఋతువు అయ్యింది.
సంస్కృతంలో ఉన్న దుఃఖః అన్నది దుఃఖము అయ్యింది తెలుగులో.
కౢప్తః అనే సంస్కృత శబ్దం కౢప్తము అయ్యింది.
సంస్కృతంలోని ధరణీ శబ్దం  తెలుగులో ధరణి అయ్యింది.
ఆజ్ఞ అన్నది యథాతధంగా తెలుగులోనికి వచ్చేసింది.
పఙ్క్తి అన్నది తెలుగులో సాధారణంగా పంక్తి అని వ్రాస్తాము పూర్ణానుస్వారంతో.

ౡ అనే ఏకాక్షరశబ్దం సంస్కృతంలో ఉంది కాని తెలుగులో లేదు. ఐటె దీనిని తెలుగు వర్ణమాలలో ఎందుకు చేర్చుకున్నట్లు అన్న ప్రశ్న వస్తుంది తప్పకుండా. ఈ ౡకారము సంసృత వ్యాకరణంలో ఉంది. ప్రాకృత వ్యాకరణం లోనూ‌ఉంది. ఈ వర్ణం కేవలం మంత్రశాస్త్రంలో తప్ప ప్రయోగంలో లేదు. అక్కడ అవసరం కాబట్టి సంస్కృతవర్ణమాలలో ఉంది.  కవులు కావ్యారంభంలో మాతృకాపూజచేయటానికి ఈశాన్యమూలను వ్రాయవలసిన అచ్చుల సమామ్నయంలో ఈ వర్ణమూ ఉంది కాబట్టి దీనికి సంస్కృతంలో ఉన్నట్లే తెలుగులో కూడా ఒక అక్షరరూపం ఇవ్వవలసి వచ్చింది. అంతకంటే ఈ వర్ణానికి విశేషప్రయోజనం ఏమీ లేదు.

ఈ 19 సంస్కృతవర్ణాలతో కూడిన మాటలు తెలుగులో వ్యవహారంలో చాలా హెచ్చుగానే ఉన్నాయి. ఇవన్నీ సంస్కృతంలో నుండి తెలుగులోనికి దిగుమతి ఐన మాటలే.

ఐతె, అరుదుగా కొన్ని తెలుగు మాటల్లో కూడా ఈ వర్ణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు ఠేవ అన్నది తెలుగు మాటే. సంస్కృతంలోంచి వచ్చింది కాదు.

ఈ విషయం మరికొంత వచ్చే టపాలో చర్చించటం జరుగుతుంది.

6, డిసెంబర్ 2014, శనివారం

3. తెలుగు భాషకు 36 వర్ణాలు.

[ పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం.  సంజ్ఞాపరిఛ్ఛేదం.  సూత్రం -3 ]

తెనుఁగునకు వర్ణములు ముప్పదియాఱు

తెలుగుభాషకు వర్ణములు 36.

ఇంతవరకూ మనం సంస్కృత వర్ణమాలనీ, ప్రాకృత వర్ణమాలనీ చూసాం.  ఈ క్రింద ఇచ్చిన పట్టికల్లో తెలుగు వర్ణమాలను చూడండి. తెలుగు వర్ణమాల అంటే ఇక్కడ అచ్చతెలుగు వర్ణమాల అని అర్థం చేసుకోవాలి.

ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్నికొన్ని ఆపరెటింగ్ సిస్టమ్స్ వాడే వారికి ఈ పట్టకలోని కొన్ని అక్షరాలు కనిపించకపోవచ్చును సరిగా. ఉదాహరణకు ఆండ్రాయిడ్ వాడేవారి సెల్ ఫోన్లలో దంత్యమైన చ జ లు కనిపించవు!

ఇందులో కూడా పూర్తి వర్ణమాల (సంస్కృతవర్ణమాలతో సహా) చూపాను. కాని తెలుగులో‌ లేని వర్ణాలను రంగువేసి యిలా  వలె చూపించాను.

అం అఁ అః

ఙ 
చ ౘజ ౙ


ఈ‌ పట్టిక ప్రకారం తెలుగులో అచ్చులు 14.  సంస్కృతంలోని ఋ, ౠ, ఌ, ౡ, అః (విసర్గ)  తెలుగులో లేవు. కొత్తగా పొట్టి ఎ, పొట్టి ఒ, అరసున్నా అన్నవి చేరాయి. కాబట్టి సంస్కృతవర్ణమాలలో అచ్చులు 5 వర్ణాలు తగ్గి కొత్తగా 3  వర్ణాలు చేరి తెలుగులో మొత్తం 16 - 5 + 3 = 14  అచ్చులు తెలుగులో ఉన్నాయి.

అలాగే హల్లులు రెండవపట్టికలోని 15, మూడవపట్టికలోని 7 కలిపి 22.  10 వత్తు అక్షరాలూ, రెండు అనునాసికాక్షరాలూ తగ్గాయి.  తెలుగు హల్లులో ౘ , ౙ కొత్తగా చేరాయి.  ముఖ్యంగా గమనించవలసింది ఈ రెండు అక్షరాలూ చ,జ ల ప్రక్కనే అవే గళ్ళల్లో చూపబడ్డాయి. అలా చేయటానికి కారణం ఉంది.  క్రమంగా బోధపడుతుంది. ప్రాకృతంలాగా తెలుగులోనూ‌ శ, ష లు లేవు. అందుచేత మొత్తం హల్లుల సంఖ్య 25 + 2 - 10 -2 + 7 = 22 .

ఈ అచ్చతెలుగు వర్ణమాలలో ఱ లేనే లేదు! ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే శకటరేఫం లేదా బండి ఱ అనేది రేఫము (అంటే ర) అనే వర్ణాన్ని ఊది పలకటం వలనే ఏర్పడుతోంది కాని ప్రతేకమైన వర్ణం కాదు. కేవలం ఉఛ్ఛారణా బేధము మాత్రమే.  మరింత వివరంగా దీనిని గురించి రాబోయే 18వ సూత్రంలో చెప్పుకుందాం.

తెలుగు వర్ణమాలలోని ళకారం శబ్దసిధ్ధం, తళుకు, బెళుకు వంటి మాటల్లో ఉన్నట్లుగానే.  అలఘులకారం అని మరొక ధ్వని విశేషం ఉంది దానినీ ళ తోనే సూచిస్తాం. వివరాలను  ముందు రాబోయే 18వ సూత్రంలో తెలుసుకుందాం. కొంచెం ఓపిక పట్టండి.

2. ప్రాకృత భాషకు 40 వర్ణాలు

[ పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం.  సంజ్ఞాపరిఛ్ఛేదం.  సూత్రం -2 ]

ప్రాకృతమునకు వర్ణములు నలుబది.

ప్రాకృత భాషకి 40 వర్ణాలు

సంస్కృతభాషలో ఉన్న వర్ణాలు కొన్ని ప్రాకృత భాషలో లేవు.

సంస్కృతవర్ణమాలలో ఉండి ప్రాకృతంలోని వంటి అక్షరాలను నల్లగా కాక పటవర్ణాని దగ్గరలో క్రింద పట్టీల్లో ఋ లాగా చూపాను.

ప్రాకృతభాష వర్ణమాలను క్రింద ఇచ్చిన పట్టికలలో చూడండి.


అంఅః

ఙ 



అచ్చులు సంస్కృతంలో 16 ఉంటే వాటిలో  6 ఎగిరిపోయి 10 మాత్రమే ప్రాకృతంలో ఉన్నాయి.
అలాగే హల్లుల్లో  సంస్కృతంలో 34 ఉంటే వాటిలో4 ఎగిరిపోయి 30 మాత్రలో ప్రాకృతంలో ఉన్నాయి.

నిజానికి మనం చెప్పుకోవలసిన క్రమంలో చెప్పుకుంటే,
అచ్చులు ప్రాకృతంలో 10 ఉంటే వాటికి మరొక  6 చేరి  సంస్కృతంలో 16  అచ్చులు ఉన్నాయి.
అలాగే హల్లుల్లో  ప్రాకృతంలో 30 ఉంటే వాటిలో 4 చేరి  సంస్కృతంలో 34 హల్లులు ఉన్నాయి.

అసలు ప్రాకృతం అంటే అదే భాష?

ఈ విషయంలో ఒక శ్లోకం ఉంది.

షడ్విధేయం ప్రాకృతిశ్చ శూరసేనీచ మాగధీ
పైశాచీ చూళికా పైశాచ్యపభ్రంశ ఇతిక్రమాత్

అని. అంటే ప్రాకృతం అనేది ఆరు రకాలుగా ఉంది.  ఈ భాషలు

  1. ప్రాకృతం
  2. శూరసేని
  3. మాగథి
  4. పైశాచి
  5. చూళిక
  6. అపభ్రంశ పైశాచి 

అనేవి.  దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే ప్రాకృతం అంటే అప్పటికి వ్యవహారంలో ఉన్న వాడుక భాష.  దీనికి మరొక ఐదురకాల మాండలికాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఆరు విధాలుగా వ్యావహరిక భాష ఉండేది. కాని ఇలా సంస్కృతంలో అదనంగా కొన్ని అచ్చులూ హల్లులూ‌ చేరాయని చెప్పటం‌ బదులుగా, ఈ బాలవ్యాకరణం సూత్రక్రమాన్ని అనుసరించి ప్రాకృతంలో కొన్ని తగ్గాయి అని చెప్పుకోవటం.

ఈ ప్రాకృతాన్ని సంస్కరించటం ద్వారా ఒక  సమగ్రభాషాస్వరూపం ఏర్పడింది. అలా ఏర్పడిన భాషకే సంస్కృతం (సంస్కరించబడినది) అని పేరు.

ప్రాకృత భాషలోనూ కవిత్వం ఉంది. అది మర్చిపోకూడదు.
అలాగే గుణాఢ్యుడు అనే మహాకవి బృహత్కథ అనే గొప్ప గ్రంథాన్ని ప్రాకృతంలోనీ పైశాచీ మాండలికంలో వ్రాసాడు.

ఈ సూత్రానికి వివరణ వ్రాస్తూ సూరిగారు ఇలా అన్నారు.
కొందఱ మతంబున హ్రస్వ వక్రంబులును బ్రాకృతమునందుఁ గలవు. 
కొందఱ మతంబున వక్రతమంబులుం గలవు.
ఎ ఏ ఒ ఓ లు వక్రములని, ఐ ఔ లు వక్రతమంబులని, ప్రాచీనులు వ్యవహరింతురు.

( హ్రస్వవక్రములు అంటే వక్రములలోని ఎ ఒ లు. )

ప్రాకృతంలో కనిపిస్తున్న ఎక్కో, కైతవం, కైఱవం వంటి కొన్ని మాటల ఆధారంగా ఇలాంటి వాదనలు ఉన్నాయి.

ఈ హ్రస్వవక్రములు, వక్రములు వక్రతమములు అనే మాటలను నన్నయాదులు వాడారు. ఈ సంజ్ఞలు ఆంధ్రశబ్ద చింతామణిలో కనిపిస్తున్నాయి. ఈ ఆంధ్రశబ్ద చింతామణి అన్నది సంస్కృతంలో వ్రాయబడిన తెలుగు వ్యాకరణం. దీనిని విరచించింది నన్నమభట్టు గారు. ఈ ఆంధ్ర శబ్ద చింతామణికి నన్నయభట్టీయము అనీ, శబ్దాను శాసనము అనీ, వాగనుశాసనీయము అనీ కూడా వ్యవహార నామాలున్నాయి.  నన్నయగారికి వాగనుశాసనుడనీ, శబ్దశాసనుడనీ బిరుదులున్నాయి కాదా, అవి ఈ వ్యాకరణం వ్రాయటం వలన వచ్చి ఉండవచ్చును. లేదా ఆయనకు ఉన్న బిరుదుల కారణంగా ఆంధ్రశబ్ద చింతామణికే ఆ బిరుదులూ వ్యవహార నామాలు కావచ్చును. మనకి స్పష్టంగా తెలియదు.

ఈ ఆంధ్రశబ్ద చింతామణిలో 270దాకా శ్లోకాలున్నాయి. వివరాలు అప్రస్తుతం కాని ఒక్క మాట. అతిప్రసిధ్దమైన నానుడి

విశ్వ శ్రేయః కావ్యమ్‌

అన్న మాట ఉందే అది ఆంధ్రశబ్ద చింతామణిలోనిదే. అది ఆ గ్రంథంలో మొదటి సూత్రం! విశ్వానికి శ్రేయస్సు కూర్చేదే కావ్యం అని దీని భావం. ఎంత ఉదాత్త భావన!

అంతే కాదు మరిక అందమైన అందరికీ, ముఖ్యంగా నేటి తరాల తెలుగువారికి బాగా నచ్చే ముక్కనూ ఆ నన్నయ్యగారి ఆంద్రశబ్ద చింతామణి గ్రంథమే మొట్టమొదటగా ప్రకటించింది.

సిద్ధిర్లోకాద్దృశ్యా

అని. అంటే లోకవ్యవహారం నుండే శబ్దాల స్వరూపం సిధ్దిస్తుంది అని దీని అర్థం.

4, డిసెంబర్ 2014, గురువారం

1. సంస్కృత భాషకు 50 వర్ణాలు.

 చిన్నయసూరిగారి  బాలవ్యాకరణం సంజ్ఞా పరిఛ్ఛేదం సూత్రం - 1

గమనిక. సంజ్ఞాపరిఛ్ఛేదం అంటే సాంకేతిక విషయాలకు సంబంధించిన విభాగం (chapter)  అని అర్థం. అన్ని శాస్త్రాల్లాగే వ్యాకరణశాస్త్రానికీ దాని సంబంధించిన పరిభాష (terminology) ఉంది.

 సంస్కృతమునకు వర్ణంబు లేఁబది

సంస్కృతభాషలో ఉన్న అక్షరాల సంఖ్య 50.


వీటిని ఇలా  బొమ్మల్లో చూదాం.


అంఅః

ఙ 



పైన మూడు పట్టికలు కనిపిస్తున్నాయి కదా.

అచ్చులు

అన్నింటి కన్నా పై పట్టికలో అ నుండి అః వరకూ ఉన్న 16 వర్ణాలనూ అచ్చులు అంటారు.

హల్లులు

మిగిలిన రెండు పట్టికల్లో ఉన్న క నుండి ళ వరకూ ఉన్న 34 వర్ణాలనూ హల్లులు అంటారు.

అసలు సంస్కృతం అన్న పేరు ఆ భాషకు ఎలా వచ్చింది?

సంస్కృతం అన్న మాటకి అర్థం సంస్కరించబడినది అని.  ఏమిటయ్యా ఇక్కడ సంస్కరించబడింది అంటే అప్పటిలో వ్యవహారంలో ఉన్న భాష.  భాషాప్రదీపం అనే పుస్తకంలో పాణినీయాది సంస్కృతా సంస్కృతా భవేత్ అని ఉంది.  ఈ‌ముక్కకి అర్థం ఏమిటీ అంటే‌ పాణిని మొదలైన ఋషుల చేత సంస్కారం చేసి తీర్చిదిద్దబడిన భాషే సంస్కృతం అయ్యింది అని.

అచ్చులు హల్లులు అన్న పేర్లు ఎలా వచ్చాయి?

పాణిని ఒక మహర్షి. అయనను  గురించి వికీపీడియాలో  చూడండి ఆసక్తి కలవారు. ఈ పాణిని మహర్షికి వ్యాకరణం సాక్షాత్తూ‌పరమశివుడే గురువుగా బోధించాడట, ఆయనకు ఒకరిని దగ్గర కూర్చో బెట్టుకుని బోధచేసే తీరిక ఉండదు కదా మరి. అందుకని అబ్బాయీ ఇదిగో‌ ఢమరుకం మ్రోగిస్తున్నాను. ఈ శబ్దాలనుండి సూత్రాలు గ్రహించు అని అనుగ్రహించాడట శివుడు. అవి మొత్త 14 సూత్రాలు. వాటిని మాహేశ్వర సూత్రాలంటారు. అవి ఇవిగో

  1.  అ ఇ ఉ ణ్
  2.  ఋ ఌ క్
  3.  ఏ ఓ ఙ్
  4.  ఐ ఔ చ్
  5.  హ య వ ర ట్
  6.  ల ణ్
  7.  ఞ మ ఙ ణ న మ్‌
  8.  ఝ భ ఞ్‌
  9.  ఘ ఢ ధ ష్
10.  జ బ గ డ ద శ్
11.  ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్
12.  క ప య్
13.  శ ష స ర్
14.  హ ల్‌

ఈ సూత్రాల్లో మొదటిదైన అ ఇ ఉ ణ్  నుండి ఐ ఔ చ్ వరకూ గలవి అచ్చులు. వీటిలో మొదటి సూత్రం అ తో ప్రారంభం అవుతుంది. నాలుగవ సూత్రం చ్ అనే దానితో పూర్తవుతుంది. ఈ‌ ఆధ్యంతాలను కలిపితే అచ్ అవుతుంది.  ఈ మధ్యలో ఉన్న వర్ణాలకు అందుకే అచ్చులు అని పేరు.

అలాగే ఐదవసూత్రం హ య వ ర ట్ అని మొదలౌతుంది కదా. ఆఖరు సూత్రం హల్ అని ముగుస్తుంది. ఈ మొదటి హకారం నుండి తుది ల్ వరకు ఉన్నవన్నీ హల్లులు అయ్యాయి.

వర్ణమాలలో పైన హల్లుల్ని అకారాంతగా చూపించింది కేవలం ఉఛ్ఛారణాసౌలభ్యానికే.  సిధ్ధాంతకౌముది లో హకారదిషు అకారః ఉఛ్ఛారణార్థః అని చెప్పారు.

ఇక్కడ హల్లుల్లోని ళకారం, హేళనలో ఉన్న ళ వలె మూర్ధన్య ళకారం.

ఎ ఒ అనే అక్షరాలు లేవా?

సంస్కృతంలో ఏ ఓ అనేవి తప్ప పొట్టి అక్షరాలు లేవు వీటికి.

మరి క్ష సంగతి యేమిటి?

అది కూడా సంస్కృత వర్ణమాలలో లేదు.

వ్యావహారికభాషలో తెలుగు వ్యాకరణం

నా మాతృభాష తెలుగు.

అసలు మాతృభాష అంటే ఏమిటీ? ఒక భాషను మాతృభాష అనే ఎందుకు ఎంచుకోవాలీ? అలా ఎంచుకుందుకు తగిన ప్రాతిపదికలు ఏమిటీ? ఎంపికలో స్వేఛ్ఛ ఉంటుందా? మాతృభాష అనే ఎందుకు అనాలీ, పితృభాష అని ఎందుకు అనకూడదూ? ఒక భాషను మాతృభాష అని అంటే అది ఇతరభాషల పట్ల ద్వేషాన్నో, వైమనస్యాన్నో అంతంత పెద్ద మాట లెందుకూ అనుకుంటే, చులకనభావాన్నో కలిగి ఉండటం కాదా? ఒక భాష మాతృభాష ఐతే ఏమొచ్చె ఏ భాష ఐనా అదొక పనిముట్టే కదా దానిపైన ఇలా భావోద్వేగాన్ని పెంచుకోవటం అవసరమా సమంజసమా?  ఎవరి మాతృభాషను వారు ప్రపంచంలోనే గొప్పదీ తీయనిదీ వగైరా అంటూ డప్పువేసుకుంటూ‌ పోతే జాతీయసమగ్రత దెబ్బతినదా? ఒక ప్రాంతంవారి మాతృభాషాభిమానం ఆ ప్రాంతంలో ఇతరభాషలకు అన్యాయం జరిగేందుకు దారితీయదా?‌  అసలు ఒకరికి ఒక భాష మాత్రమే మాతృభాష ఎందుకు కావాలీ?

అసలు ఇన్ని ప్రశ్నలు ఎందుకు ప్రస్తావించటం అంటే, ఇవి చర్చల రోజులు దొరికిన సంగతి దొరికినట్లుగా దొరకబుచ్చుకొని చర్చలమీద చర్చలు చేస్తూ పోతున్న రోజులు.

ఈ విధమైన ప్రశ్నలు ఎన్నడూ నాకు నేను వేసుకోలేదు. అలాంటి అవసరం ఒకటి ఉన్నదేమో అన్న ఆలోచన కూడా ఎన్నడూ నాకు రాలేదు.  అమ్మను అమ్మ అనుకుందుకు ఎలా ఎన్నడూ ప్రశ్నలు రావో అలాగే తెలుగును మాతృభాష అనుకుందుకూ నాకు ఎప్పుడూ ఏ ప్రశ్నలూ రాలేదు. ఇప్పుడు అలాంటి ప్రశ్నలు వేసుకుందుకూ నాకు అవసరం కనిపించటం లేదు.

ఈ చర్చల నుండి కొందరు వినోదం ఆసిస్తున్నారేమో నాకు తెలియదు, అలాంటి వారు ఉంటే ఉండి ఉండవచ్చును కూడా.

ఈ చర్చల నుండి కొందరు విషయసేకరణ చేయాలని ఆశిస్తున్నారు. ఆ విషయంలో అనుమానం లేదు. కాని అలా విషయసేకరణ జరుగుతున్నదా?  అది ఒక పధ్ధతి ప్రకారం అమరుతున్న విషయమేనా? అన్న సంగతి మాత్రం నాకు కొన్ని అనుమానాలున్నాయన్నది వాస్తవం.

ఏ చర్చ ఐనా సరే దానికి సంబంధించిన విషయపరిజ్ఞానం దండిగా ఉన్నవారి మధ్యన జరిగితే వారికీ సమాజానికీ ఉపయోగం అని నా అభిప్రాయం. కాని దీనితో కొందరు విబేధిస్తున్న సంగతి గమనించాను. ఆ విషయం పైన మాట్లాడటానికి ఇది వేదిక కాదు.

ఈ తెలుగువ్యాకరణం అనే వేదిక (బ్లాగు) మీద ఒకే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను.

తెలుగు వ్యాకరణం అధారంగా  వ్యావహారిక భాషలో టపాలు వ్రాయటం. 

ఇప్పటికి ఉన్న తెలుగువ్యాకరణం గ్రాంథిక భాషలో ఉంది. దానిపైన వచ్చిన వ్యాఖ్యలూ తదనుగుణమైన గ్రంధభాషలోనే ఉన్నాయి.

పాఠశాలల్లో నేర్చుకునేది మార్కుల చదువు మాత్రమే కావటం వలన కొంతా, గ్రాంథికభాషలో పట్టు చిక్కకపోవటం వలన కొంతా జనానికి ఈ వ్యాకరణమూ, దాని వ్యాఖ్యలూ కూడా చదవటానికి ఇబ్బందిగా ఉందని అనుకుంటున్నాను.

తెలుగు వ్యాకరణాన్ని జనం మాట్లాడుకునే భాషలో చెప్పటానికి చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని చదువరులు హర్షిస్తారని ఆశిస్తున్నాను.

తెలుగువ్యాకరణాన్ని ఎంచుకోవటానికి కారణాలు రెండు. మొదటిది, తెలుగు నా మాతృభాష. రెండవది నేను ప్రథానంగా చేస్తున్న కృషి  అంతా తెలుగులోనే కాబట్టి.

ఈ‌కృషి అందరికీ నచ్చాలని ఆశిస్తున్నాను. ఎవరికైనా నచ్చకపోతే వారిపట్ల వైమనస్యం ఏమీ‌ ఉండదు. వారు నిరభ్యంతరంగా ఈ కృషిని ఉపేక్షించవచ్చును.