4, డిసెంబర్ 2014, గురువారం

వ్యావహారికభాషలో తెలుగు వ్యాకరణం

నా మాతృభాష తెలుగు.

అసలు మాతృభాష అంటే ఏమిటీ? ఒక భాషను మాతృభాష అనే ఎందుకు ఎంచుకోవాలీ? అలా ఎంచుకుందుకు తగిన ప్రాతిపదికలు ఏమిటీ? ఎంపికలో స్వేఛ్ఛ ఉంటుందా? మాతృభాష అనే ఎందుకు అనాలీ, పితృభాష అని ఎందుకు అనకూడదూ? ఒక భాషను మాతృభాష అని అంటే అది ఇతరభాషల పట్ల ద్వేషాన్నో, వైమనస్యాన్నో అంతంత పెద్ద మాట లెందుకూ అనుకుంటే, చులకనభావాన్నో కలిగి ఉండటం కాదా? ఒక భాష మాతృభాష ఐతే ఏమొచ్చె ఏ భాష ఐనా అదొక పనిముట్టే కదా దానిపైన ఇలా భావోద్వేగాన్ని పెంచుకోవటం అవసరమా సమంజసమా?  ఎవరి మాతృభాషను వారు ప్రపంచంలోనే గొప్పదీ తీయనిదీ వగైరా అంటూ డప్పువేసుకుంటూ‌ పోతే జాతీయసమగ్రత దెబ్బతినదా? ఒక ప్రాంతంవారి మాతృభాషాభిమానం ఆ ప్రాంతంలో ఇతరభాషలకు అన్యాయం జరిగేందుకు దారితీయదా?‌  అసలు ఒకరికి ఒక భాష మాత్రమే మాతృభాష ఎందుకు కావాలీ?

అసలు ఇన్ని ప్రశ్నలు ఎందుకు ప్రస్తావించటం అంటే, ఇవి చర్చల రోజులు దొరికిన సంగతి దొరికినట్లుగా దొరకబుచ్చుకొని చర్చలమీద చర్చలు చేస్తూ పోతున్న రోజులు.

ఈ విధమైన ప్రశ్నలు ఎన్నడూ నాకు నేను వేసుకోలేదు. అలాంటి అవసరం ఒకటి ఉన్నదేమో అన్న ఆలోచన కూడా ఎన్నడూ నాకు రాలేదు.  అమ్మను అమ్మ అనుకుందుకు ఎలా ఎన్నడూ ప్రశ్నలు రావో అలాగే తెలుగును మాతృభాష అనుకుందుకూ నాకు ఎప్పుడూ ఏ ప్రశ్నలూ రాలేదు. ఇప్పుడు అలాంటి ప్రశ్నలు వేసుకుందుకూ నాకు అవసరం కనిపించటం లేదు.

ఈ చర్చల నుండి కొందరు వినోదం ఆసిస్తున్నారేమో నాకు తెలియదు, అలాంటి వారు ఉంటే ఉండి ఉండవచ్చును కూడా.

ఈ చర్చల నుండి కొందరు విషయసేకరణ చేయాలని ఆశిస్తున్నారు. ఆ విషయంలో అనుమానం లేదు. కాని అలా విషయసేకరణ జరుగుతున్నదా?  అది ఒక పధ్ధతి ప్రకారం అమరుతున్న విషయమేనా? అన్న సంగతి మాత్రం నాకు కొన్ని అనుమానాలున్నాయన్నది వాస్తవం.

ఏ చర్చ ఐనా సరే దానికి సంబంధించిన విషయపరిజ్ఞానం దండిగా ఉన్నవారి మధ్యన జరిగితే వారికీ సమాజానికీ ఉపయోగం అని నా అభిప్రాయం. కాని దీనితో కొందరు విబేధిస్తున్న సంగతి గమనించాను. ఆ విషయం పైన మాట్లాడటానికి ఇది వేదిక కాదు.

ఈ తెలుగువ్యాకరణం అనే వేదిక (బ్లాగు) మీద ఒకే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను.

తెలుగు వ్యాకరణం అధారంగా  వ్యావహారిక భాషలో టపాలు వ్రాయటం. 

ఇప్పటికి ఉన్న తెలుగువ్యాకరణం గ్రాంథిక భాషలో ఉంది. దానిపైన వచ్చిన వ్యాఖ్యలూ తదనుగుణమైన గ్రంధభాషలోనే ఉన్నాయి.

పాఠశాలల్లో నేర్చుకునేది మార్కుల చదువు మాత్రమే కావటం వలన కొంతా, గ్రాంథికభాషలో పట్టు చిక్కకపోవటం వలన కొంతా జనానికి ఈ వ్యాకరణమూ, దాని వ్యాఖ్యలూ కూడా చదవటానికి ఇబ్బందిగా ఉందని అనుకుంటున్నాను.

తెలుగు వ్యాకరణాన్ని జనం మాట్లాడుకునే భాషలో చెప్పటానికి చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని చదువరులు హర్షిస్తారని ఆశిస్తున్నాను.

తెలుగువ్యాకరణాన్ని ఎంచుకోవటానికి కారణాలు రెండు. మొదటిది, తెలుగు నా మాతృభాష. రెండవది నేను ప్రథానంగా చేస్తున్న కృషి  అంతా తెలుగులోనే కాబట్టి.

ఈ‌కృషి అందరికీ నచ్చాలని ఆశిస్తున్నాను. ఎవరికైనా నచ్చకపోతే వారిపట్ల వైమనస్యం ఏమీ‌ ఉండదు. వారు నిరభ్యంతరంగా ఈ కృషిని ఉపేక్షించవచ్చును.

4 కామెంట్‌లు:

  1. మీ ఉపోద్ఘాతంలోని భావోద్వేగాలలో,వ్యాఖ్యలలో కొన్నింటినీ నేను అంగీకరించలేను. మీరే ఆ వ్యాఖ్యలు వ్రాయకుండా ఉంటే బాగుండేదేమో! అయినా వాటిగురించి ఒక్కమాటా చర్చించదలచుకోలేదు. ఇక్కడ అసలు లక్ష్యమైన వ్యావహారిక భాషలో వ్యాకరణం అనేదానికి మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. ఈ అవసరం చాలా ఉన్నది. ఇలా చెప్పేవారు లేకనే అవసరానికి మించి కేవలం ప్రతిభావంతుల మెదడులలోనే తెలుగుని బంధిస్తే లేదా బంధించాలని చూస్తే తెలుగువారికి తెలుగు దూరమై పోతుందని నా అభిప్రాయం. ప్రజల వద్దకే పాలన లాగా ప్రజల వద్దకే తెలుగు రావాలి. అందుకు మీలాంటి మేధావులు ఇలాంటి కృషి కొనసాగించాలి. అభినందనలు శ్యామలీయం గారు.

    రిప్లయితొలగించండి
  2. మీ లాంటి వాళ్ళు ఓపిక, తీరిక చేసుకొని భాష గురించి రాస్తున్నందుకు చాలా సంతోషం. మీరు అనుమతిస్తే, సమాచారాన్ని కాపీ కొట్టి ఫైలులో భద్రపరుస్తా.

    నమస్కారాలతో
    నిమ్మగడ్డ చంద్ర శేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాపీ కొట్టటం అంటే? కాపీ కొట్టటం దేనికీ? సరిగా అర్థం కాలేదు.
      ఇది వ్రాయటం పూర్తైన తరువాత ఇ-పుస్తకం రూపంలో ఎలాగూ వస్తుంది కదా?

      తొలగించండి
  3. మిగిలిన భాగాలు చదవాలంటే కనబడలేదండీ
    మీ సులభ వ్యాకరణం లింకు పెట్టండి

    రిప్లయితొలగించండి