6, డిసెంబర్ 2014, శనివారం

3. తెలుగు భాషకు 36 వర్ణాలు.

[ పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం.  సంజ్ఞాపరిఛ్ఛేదం.  సూత్రం -3 ]

తెనుఁగునకు వర్ణములు ముప్పదియాఱు

తెలుగుభాషకు వర్ణములు 36.

ఇంతవరకూ మనం సంస్కృత వర్ణమాలనీ, ప్రాకృత వర్ణమాలనీ చూసాం.  ఈ క్రింద ఇచ్చిన పట్టికల్లో తెలుగు వర్ణమాలను చూడండి. తెలుగు వర్ణమాల అంటే ఇక్కడ అచ్చతెలుగు వర్ణమాల అని అర్థం చేసుకోవాలి.

ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్నికొన్ని ఆపరెటింగ్ సిస్టమ్స్ వాడే వారికి ఈ పట్టకలోని కొన్ని అక్షరాలు కనిపించకపోవచ్చును సరిగా. ఉదాహరణకు ఆండ్రాయిడ్ వాడేవారి సెల్ ఫోన్లలో దంత్యమైన చ జ లు కనిపించవు!

ఇందులో కూడా పూర్తి వర్ణమాల (సంస్కృతవర్ణమాలతో సహా) చూపాను. కాని తెలుగులో‌ లేని వర్ణాలను రంగువేసి యిలా  వలె చూపించాను.

అం అఁ అః

ఙ 
చ ౘజ ౙ


ఈ‌ పట్టిక ప్రకారం తెలుగులో అచ్చులు 14.  సంస్కృతంలోని ఋ, ౠ, ఌ, ౡ, అః (విసర్గ)  తెలుగులో లేవు. కొత్తగా పొట్టి ఎ, పొట్టి ఒ, అరసున్నా అన్నవి చేరాయి. కాబట్టి సంస్కృతవర్ణమాలలో అచ్చులు 5 వర్ణాలు తగ్గి కొత్తగా 3  వర్ణాలు చేరి తెలుగులో మొత్తం 16 - 5 + 3 = 14  అచ్చులు తెలుగులో ఉన్నాయి.

అలాగే హల్లులు రెండవపట్టికలోని 15, మూడవపట్టికలోని 7 కలిపి 22.  10 వత్తు అక్షరాలూ, రెండు అనునాసికాక్షరాలూ తగ్గాయి.  తెలుగు హల్లులో ౘ , ౙ కొత్తగా చేరాయి.  ముఖ్యంగా గమనించవలసింది ఈ రెండు అక్షరాలూ చ,జ ల ప్రక్కనే అవే గళ్ళల్లో చూపబడ్డాయి. అలా చేయటానికి కారణం ఉంది.  క్రమంగా బోధపడుతుంది. ప్రాకృతంలాగా తెలుగులోనూ‌ శ, ష లు లేవు. అందుచేత మొత్తం హల్లుల సంఖ్య 25 + 2 - 10 -2 + 7 = 22 .

ఈ అచ్చతెలుగు వర్ణమాలలో ఱ లేనే లేదు! ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే శకటరేఫం లేదా బండి ఱ అనేది రేఫము (అంటే ర) అనే వర్ణాన్ని ఊది పలకటం వలనే ఏర్పడుతోంది కాని ప్రతేకమైన వర్ణం కాదు. కేవలం ఉఛ్ఛారణా బేధము మాత్రమే.  మరింత వివరంగా దీనిని గురించి రాబోయే 18వ సూత్రంలో చెప్పుకుందాం.

తెలుగు వర్ణమాలలోని ళకారం శబ్దసిధ్ధం, తళుకు, బెళుకు వంటి మాటల్లో ఉన్నట్లుగానే.  అలఘులకారం అని మరొక ధ్వని విశేషం ఉంది దానినీ ళ తోనే సూచిస్తాం. వివరాలను  ముందు రాబోయే 18వ సూత్రంలో తెలుసుకుందాం. కొంచెం ఓపిక పట్టండి.

15 కామెంట్‌లు:

  1. అయితే మేము చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ లో నేర్చుకున్నది సంస్కృత వర్ణమాల అన్న మాట. మేము చిన్నప్పుడు దిద్దిన అక్షరాల్లో "ఋ ౠ ఌ ౡ" కూడా ఉండేవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనకు బడులలో నేర్పేది తెలిగులిపి.
      ఈనాటి తెలుగులిపిలో మనం సంస్కృతవర్ణమాలను నేర్చుకుంటున్నది నిజమే.
      క్రమంగా అన్ని విషయాలూ బోధపదతాయి, రాబోయే సూత్రాల్లో.

      తొలగించండి
  2. వర్ణాలు అక్షరాలూ ఒకటేనా? కాకపొతే తేడా కాస్త విపులంగా చెప్పగలరాండీ, థాంక్స్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లోకవ్యవహారంలో వర్ణము అక్షరమూ అనేవి రెండు సమానార్థప్రతిబోధకాలే. కాని శాస్త్రం అన్నాక నిర్దుష్టంగా ఉంటుంది.

      వర్ణము అనే ద్వని విశేష సూచకం. అక్షరం అనేది ఆ ధ్వనికి ఇష్టలిపిలో వ్రాతలో ప్రవర్తించే స్వరూపం. ఇలా రెండూ వేరే వేరే విషయాలైనా వాటిలో బేధం పైన దృష్టి పెట్టవలసిన అవసరం కేవలం శాస్త్రవిషయాభ్యసనంలో కాని రాకపోవటం చేత నిత్యవ్యవహారానికి రెండూ ఒకటే.

      అ-నుండి-ళ వరకూ గల ప్రతి వర్ణానికి ఒక్కొక్క లిపిలో ఒక్కొక్క అక్షరస్వరూపం కనిపిస్తున్నది కాబట్టి వాటి బేదాన్ని గ్రహించటం పెద్దగా ఇబ్బంది పెట్టే విషయం కాకూడదు.

      ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఒకే వస్తువుకు వర్ణం ద్వనిరూపం అక్షరం దృశ్యరూపం.

      తొలగించండి
    2. వర్ణం అనే పదానికి ఇంగ్లీషులో ఏదయినా మాట ఉందాండి? Thanks.

      తొలగించండి
    3. జైగారూ,
      ఆంగ్లంలో కూడా ఈ విభజన ఉన్నదండీ. చూడండి -

      వర్ణము: letter
      అక్షరము: glyph

      ఐతే ఈ రెండు మాటలనూ వ్యవహారంలో ఆంగ్లంలో letter అని పలకటం సాధారణం. కాని, సాంకేతికంగా ఇది సరికాదు. http://en.wikipedia.org/wiki/Glyph పేజీని చూడండి.

      తొలగించండి
  3. నాకు "ఱ" తప్ప అన్నీ పలకడం వచ్చు. "ఱ" పలకడం ఎలాగో చెపుతారా?

    రిప్లయితొలగించండి
  4. మీది గురు స్థానం ఎప్పటికి,నమస్కారం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను వ్యాకరణానికి సరైన శిష్యుడనో కాదో కూడా నాకు సరిగ్గా తెలియదండి!
      ఐనా మనవాళ్ళకు నాకు తోచినట్లుగా వ్యాకరణం పరిచయం చేయాలనేది నా పేరాశ!
      మిగతాది మీవంటి పెద్దల ఆశీర్వాదం, మిత్రుల ఆదరణ, మీదుమిక్కిలి భగవత్కృప.
      అంతేనండి.

      తొలగించండి
  5. నా ఆండ్రాయిడ్(కిట్ కేట్) ఫోన్ లో చ జ లు కూడా కనిపిస్తున్నాయండి.

    రిప్లయితొలగించండి
  6. మామూలు చ జ లకు ఇబ్బంది ఉండదండీ. వాటి దంత్యాక్షరాలే క్నిపించకపోవచ్చును. మీకు వర్ణమాల పటంలోని వర్గాక్షరాలలో చ జ లకు ప్రక్కనే మరొక అక్షరం చొప్పిన కనిపించాలి కదా? సరిగా కల్నిపిస్తున్నాయా? డబ్బాలు వస్తున్నాయా? చూసి చెప్పగలరు. నాదగ్గర kitcat ఫోన్ ఉంది కాని దానిలో ఈ ఇబ్బంది గమనించాను,

    రిప్లయితొలగించండి
  7. నమస్కారం సర్
    చింతాకు ఏ సంధి ఎలా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవర్ణ దీర్ఘ సంధి.
      సవర్ణదీర్ఘ సంధి: అ - ఇ - ఉ - ఋ -ల కు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును.( వివరణ: అ, ఇ, ఉ, ఋ, మరియు ఆ, ఈ,ఊ, ౠ, అక్షరములు తో అవే అక్షరములు కలిసి అదే అక్షరము దీర్ఘాక్షరముగా నేర్పడును. దానిని సవర్ణ దీర్ఘ సంధి అని అందురు.
      Source: Wiki

      తొలగించండి
    2. చింతాకు సంధి విషయం
      బింతకు మును పెరుగనండి, యిప్పుడు దెలిసెన్,
      అంతా శ్రీ గురువుల దయ,
      ఇంతకు సంస్కృతమ? తెనుగ? యిది తెలియుటలే .

      తొలగించండి