10, డిసెంబర్ 2014, బుధవారం

6. పరుషాలూ సరళాలూ స్థిరాలూ అని హల్లులు మూడు రకాలు.

 [పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం.  సంజ్ఞాపరిఛ్ఛేదం.  సూత్రం - 4, సూత్రం‌ - 6, సూత్రం - 7 ]


క చ ట త ప లు పరుషంబులని గ జ డ ద బ లు సరళంబులని చెప్పంబడు

హల్లులలో  క చ ట త ప లని పరుషాలు అంటారు.
హల్లులలో గ జ డ ద బ లని సరళాలు అంటారు.

కచటతపః పరుషాఖ్యాః గజడదబాస్తు సరళాః అని ఆంధ్రశబ్ద చింతామణి.

కచటతపలను ఉఛ్ఛరించటంలోనూ గజడదబలను ఉఛ్ఛరించటంలోనూ ఉన్న శబ్దమార్దవ బేధాన్ని అనుసరించి వీటిని పరుషాలూ సరళాలూ అని వర్గీకరించారు.

చకారం జకారం అనేవి తాలవ్యమూ దంతవ్యమూ అని రెండురకాలుగా ఉన్నాయి. ఆ విషయం ముందు ముందు ఏడవ సూత్రంలో తెలుసుకుందాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే తాలవ్యదంతవ్య బేధం అనేది ఈ వర్గీకరణకు సంబంధించి లెక్కలోకి రాదు అని.

ఇతరములగు హల్లులుస్థిరములు

పరుషాలూ సరళాలూ పోను మిగిలిన హల్లులన్నింటికీ స్థిరములు అని పేరు.
సూరి గారు వాటిని స్పష్టంగా లిష్టు వేసి మరీ ఇచ్చారు.
ఖ ఘ ఙ , ఛ ఝ ఞ, ఠ ఢ ణ,  థ ధ న, ఫ భ మ,  య ర ల వ శ ష స హ ళ

ఇప్పుడు మనం పరుషాలూ,  సరళాలూ,  స్థిరాలూ పట్టికలలో చూదాం. (రంగులు గుర్తుపట్తటంలో సౌలభ్యం కోసం)

ఙ 
చ ౘజ ౙ



ఇలా మొత్తం 36 హల్లుల్లో 5+1 పరుషాలు, 5+1 సరళాలూ ఉందగా మిగిలిన 24 హల్లులూ  స్థిరాలు.

దంత్య తాలవ్యంబు లయిన చజలు సవర్ణంబులు


దంత్యమైనా తాలవ్యమైనా చకారం పరుమే.  దంత్యమైనా తాలవ్యమైనా జకారం సరళమే.

సూరిగారు ఇలా విశదీకరించారు.

తాలవ్యచకారంబు దంత్యచకారంబునకును దాలవ్య జకారంబు దంత్యజకారంబునకును గ్రాహకంబులు

ముందు తాలవ్య దంతవ్యాలు చకార జకారాలు చూదాం

 తాలవ్యం
దంతవ్యం
చ 


తాలువు అంటే దవడ లోపలి భాగం. చ జ లనే‌వర్ణాలను ఉత్పత్తి చేసే స్థానం తాలువు అవుతున్నది కాబట్టి చ జ లను  తాలవ్యములు అన్నారు.

దంతము అంటే తెలిసిందే. ౘ ౙ లను పలకటానికి నాలుకను దంతాలకు ఆనించి వర్ణోత్పత్తి చేస్తాము కాబట్టి వీటిని దంతవ్యములు అన్నారు.

ఐతే ఈ నాలుగు వర్ణాలకు నాభ్యంతరమైన శబ్దోత్పత్తిప్రయత్నం సమానం కాబట్టి వ్యాకరణం ఇవి సవర్ణములు అంది. తుల్యాస్య ప్రయత్నమ్‌ సవర్ణం అని పాణిని వ్యాకరణం.

సూరిగారు ఈ‌ సూత్రంలో తాలవ్య దంతవ్యాలు పరస్పరం గ్రాహకములు అన్నారు కదా? అంటే ఏమిటీ అన్న ప్రశ్న ఉంది.  వ్యాక్రరణం చ కు ఏమి సూత్రాలను విధిస్తున్నదో అవన్నీ ౘ కూ సమానంగా వర్తిస్తాయనీ అలాగే జ కు ఏ వ్యాకరణ సూత్రాలు వర్తిస్తాయో అవన్నీ సమానంగా ౙ కు కూడా వర్తిస్తాయనీ అర్థం.

ఇక్కడ తాలవ్యములు దంతవ్యములు అన్న విభాగాన్ని బాగా గుర్తుంచుకోండి వచ్చే టపాలో దాని గురించి మరింత చెప్పుకోబోతున్నాం మరి.

8 కామెంట్‌లు:

  1. గురువు గార్కి , చాలా సులభమైన రీతిలో వివరిస్తున్నారు . ఒక ఈ-బుక్ లేదా పుస్తకం రూపంలో తీసుకురావచ్చు కదా .విద్యార్ధులకు నాబోటి వార్కి ఉపయుక్తంగా ఉంటుంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనస్సాక్షిగారు, మీ అదరణకు సంతోషం. మీ సూచనకు ధన్యవాదాలు.మనం ఇంకా మొదటి వరుస పాఠాలలోనే ఉన్నాం కదండీ. మనం మొత్తం చెప్పుకున్నాక పుస్తకం విషయం ఆలోచిద్దాము.

      ఇలా టపాల రూపంలో ఉన్నా సులభంగా కావలసిన సంగతిసందర్భాలను పునశ్చరణ చేసుకుందుకు వీలుగా బ్లాగులోనే కొన్నిఅవసరమైన ఏర్పాట్లు చేదాం ప్రస్తుతానికి.

      తొలగించండి
  2. మరిన్ని టపాలు రాయండి....ముఖ్యంగా తెలుగు భాషా చరిత్ర గురించి.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. ధన్యవాదములు సార్

    రిప్లయితొలగించండి