9, డిసెంబర్ 2014, మంగళవారం

5. ఆంధ్రభాషకి 55 వర్ణాలున్నాయి.

[ప్రౌఢవ్యాకరణం. సంజ్ఞాపరిఛ్ఛేదం సూత్రం - 1]

ఆంధ్రభాషకు వర్ణంబు లేఁబదియైదు.

ఆంధ్రభాషకి 55 వర్ణాలున్నాయి.

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అఁ అః క ఖ గ ఘ ఙ చ ౘ ఛ జ ౙ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ

పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం ఆవిర్భవించిన తరువాత బహుజనపల్లి సీతారామాచార్యులుగారు ప్రౌఢవ్యాకరణం అని మరొక వ్యాకరణగ్రంథం వ్రాసారు. బాల వ్యాకరణంలో కొన్ని విషయాలలో అసమగ్రత ఉన్నదని భావించి ఆ లోటుపాట్లను పూర్తిచేయటానికి బహుజనపల్లివారు ప్రౌఢవ్యాకరణం వ్రాసారు. మనం వీలైన చోట్ల ఈ వ్యాకరణగ్రంథం నుండి కూడా నేర్చుకుందాం.
ఈ ప్రౌఢవ్యాకరణం లోని సూత్రం బాలవ్యాకరణం సంజ్ఞాపరిఛ్ఛేదంలో ఉన్న మూడవ, నాలుగవ సూత్రాల సమాహారం. అంటే ఆ సూత్రాల కలగలుపు అన్న మాట. మొత్తం వర్ణమాలను ఇక్కడ పట్టిల రూపంలో చూడండి.

అంఅఁఅః

ఙ 
చ ౘజ ౙ


ఈ‌ పట్టిక ప్రకారం తెలుగులో అచ్చులు 19.  హల్లులు 25 +2++ 9 = 36
అచ్చులూ హల్లులూ కలిపి మొత్తం వర్ణాలు 19 + 36 = 55

ఈ సూత్రానికి బహుజనపల్లివారి వివరణ ఈ విధంగా ఉంది.

1. ౡకార గ్రహణము సంస్కృత ప్రాకృత భాషా వ్య్తాకరణజ్ఞుల సమ్మతము. అయ్యది మంత్ర శాస్త్ర ప్రసిధ్ధము..
2. యవలల వలె రేఫంబును ప్రయత్నభేదంబుచే ద్వివిధంబు గాన శబ్దశాసనాదులచేత నలఘురేఫము వర్ణాంతరముగా గ్రహింపబడదయ్యె.
3. క్షకారము సంస్కృతవ్యాకరణముల యందును, నిఘంటువుల యందును, షాంతపద మధ్యమునందుఁ బఠింపఁబడుటం జేసి యది వర్ణాంతరము గాదు; సంయుక్తాక్షరమని తెలియవలయు. 


మనం క్రిందటి టపాలోనే ఈ క్రింద చెప్పిన మాటలు చదువుకున్నాం.

ౡ అనే ఏకాక్షరశబ్దం సంస్కృతంలో ఉంది కాని తెలుగులో లేదు. ఐటె దీనిని తెలుగు వర్ణమాలలో ఎందుకు చేర్చుకున్నట్లు అన్న ప్రశ్న వస్తుంది తప్పకుండా. ఈ ౡకారము సంసృత వ్యాకరణంలో ఉంది. ప్రాకృత వ్యాకరణం లోనూ‌ఉంది. ఈ వర్ణం కేవలం మంత్రశాస్త్రంలో తప్ప ప్రయోగంలో లేదు. అక్కడ అవసరం కాబట్టి సంస్కృతవర్ణమాలలో ఉంది.  కవులు కావ్యారంభంలో మాతృకాపూజచేయటానికి ఈశాన్యమూలను వ్రాయవలసిన అచ్చుల సమామ్నయంలో ఈ వర్ణమూ ఉంది కాబట్టి దీనికి సంస్కృతంలో ఉన్నట్లే తెలుగులో కూడా ఒక అక్షరరూపం ఇవ్వవలసి వచ్చింది. అంతకంటే ఈ వర్ణానికి విశేషప్రయోజనం ఏమీ లేదు.


య ర ల వ లను గురించి లఘువులూ  అలఘువులూ అని రెండు రకాలున్నాయి. వీటి గురించి బాలవ్యాకరణం 18వ సూత్రంలో వస్తుంది.  ఈ విషయం దృష్టిలో ఉంచుకొని వర్ణమాలలో శకటరేఫం అంటే నండి ఱ చేర్చలేదు. ఇది సూరి గారు కొత్తగా చేసిన వర్గీకరణం కాదు.  నన్నయగారు చేసినదే.

క్షకారం ఒక వర్ణం కాదు. సంయుక్తాక్షరం. బహుజనపల్లివారు క్షకారం ఎందుకు ప్రత్యేకమైన వర్ణంగా వర్ణమాలలో చేరదో చెప్పారు. (క్షకారం వర్ణమాలలో ఉందనే వాదన కూడా ఉంది.) 

వర్ణమాలలోని కొన్ని అక్షరాల గురించి విడిగా ఒక టపాలో చదువుకుందాం. ప్రస్తుతానికి వర్ణమాల ఎలా ఉన్నదని వ్యాకరణం చెబుతున్నదీ తెలుసుకుంటే చాలు.

5 కామెంట్‌లు:

  1. క్షకారం వర్ణమాలలో ఉందనే మాట కూడా ఉంది.
    ----------------------
    క్ష త్ర జ్ఞ సంయుక్తాక్షరములని ఎలిమెంటరీ స్కూల్ లో చదివినట్లు గుర్తు. వాటిమీద వాదనలు ఏమిటో నాకు అర్ధం కావటల్లేదు.
    Thanks for everything you are doing. మిడి మిడి జ్ఞానం ఉన్న మాలాంటి వాళ్ళందరికీ పనికొస్తుంది.

    రిప్లయితొలగించండి
  2. నన్నయ్య నుండి తెలుగున
    నెన్నబడిన గ్రాంధికాని కేర్పడ బుధుడా
    చిన్నయ వ్రాసిన వ్యాకృతి
    చెన్నగు వాడుక తెలుగున జెప్పుట జూడన్ ….

    ఎన్నదగు గొప్ప పని యిది ,
    మన్నింతురొ లేదొ బుధులు , మహితాత్మా ! ఓ
    అన్నా! శ్యామల రావూ !
    పన్నుగ తమ పనికి తగిన ఫలితము దక్కున్

    తెలుగు పలుకుబళ్ళ తీరు తెన్నుల లోని
    మూలములకు మారుమూల పల్లె
    సీమలే కుదుళ్ళు - చిత్రమేమిటనగ
    నేల విడిచి సాము నింగి కెగసె

    వాడుక పద యొరవడిలో
    పోడిమి గల వ్యాకరణము బుధ్ధిం దెలియన్
    నేడు తెలుగు విద్యార్ధుల
    తోడుగ తమరుంట మాకు తోషంబయ్యెన్

    చిన్నయ వ్యాకరణానికి
    సన్నుతమగు వ్యాఖ్య వ్రాసి సరిపుచ్చక - స
    ర్వోన్నతముగ తెలుగు నుడికి
    పన్నుగ సరిక్రొత్త రుచులు పండించండీ !

    ----- అభినందనలతో


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావుగారూ,

      నిజానికి నేను యెన్నడూ వ్యాకరణ విద్యార్థని కాను!

      చిననాటినుండీ తెలుగుగ్రాంథికాన్ని అలవాటుగా వ్రాస్తున్ననాకు అలా వ్యాకరణశాస్త్రం వెంటబడాలన్న కోరికా యెన్నడూ కలుగలేదు. దానివలన చిన్నచిన్న చిక్కులే కాని నిజమైన ఇబ్బందులు తలెత్తిన పరిస్థితికూడా లేదు నేటి దాకా.

      కాని, యీ నాడు వ్యాకరణపరిచయం చాలకపోవటం కారణంగా పదాలసుష్టుస్వరూపం తెలియక జనులు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివలన సంప్రదాయిక సాహిత్యాభ్యసనం కుంటుపడటం ఆందోళనకరం.

      రెండవ సంగతి ఇంకా చిత్రం. బహుజనపల్లి తరువాత వ్యాకర్తలు ఎవరూ శతాబ్దం చిల్లర కాలంలో ఒక్కరూ తెలుగు జాతిలో పుట్టకపోవటం. వ్యాఖ్యాతలు వచ్చారు సరే. అది చాలదు కదా.

      వ్యావహారిక భాషను కూడా వ్యాకరణదీపం వెలుగులోనికి తీసుకొని రావలసిన అవసరం చాలా ఉంది. ఈ విషయంలో మా మావయ్యగారు ప్రసాద్ గారితో తరచూ నాకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

      మీ అభినందనలకు అనేక మారులు శిరసా నమస్కారాలు. ఇలాంటి కృషి ఒక్కడి వల్ల అయ్యేది కాకపోవచ్చును. కాని ఎవరో ఒకరు ప్రారంభించాలిగా. అందుకే ఈ ప్రయత్నం. మీ అందరి అభిమానం చాలు ఇది సరిగా అనుకున్న లక్ష్యానికి చేరువకాగలదని నమ్మటానికి.

      తొలగించండి
  3. ఇక్కడ ఒక సందేహము కలుగుతున్నది.

    >>> తెనుఁగునకు వర్ణములు ముప్పదియాఱు
    >>> ఆంధ్రభాషకు వర్ణంబు లేఁబదియైదు.

    తెలుగు ఆంధ్రము ఒక్కటి కావా?

    రిప్లయితొలగించండి
  4. పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణసూత్రం "తెనుఁగునకు వర్ణములు ముప్పదియాఱు"
    బహుజనపల్లి సీతారామాచార్యులుగారి ప్రౌఢవ్యాకరణసూత్రం "ఆంధ్రభాషకు వర్ణంబు లేఁబదియైదు."
    వేర్వేరు వ్యాకర్తలు వేర్వేరు మాటలు వాడారు తెనుఁగు, ఆంధ్రము అని.

    పరవస్తువారు తెనుఁగు అన్నప్పుడు అచ్చతెలుగును ఉద్దేశించి చెప్పినసూత్రం అది.
    బహుజనపల్లివారు ఆంధ్రము అన్నప్పుడు సంస్కృతసమంబులతో కూడిన తెలుగును ఉద్దేశించి చెప్పిన సూత్రం అది. ఐతే ఈ సందర్భంలో పరవస్తువారి మాట తెలుగున అనే అన్నది గమనార్హం.

    ఈ తెనుఁగు ఆంధ్రము తెలుఁగు అనే నామాంతరాలను బట్టి అవి వేర్వేరు భాషలనో లేదా భాషలో వేర్వేరు విభాగాలనో అనుకోనవసరం కనిపించదు.

    రిప్లయితొలగించండి