15, జనవరి 2015, గురువారం

11. ద్రుతప్రకృతులూ కళలూ అంటే ఏమిటీ?

నకారంబు ద్రుతంబు (బాల. సంజ్ఞా. 11)


ద్రుతం అన్న పదానికి అర్థం జారిపోయే స్వభావం కలదీ అని అర్థం. వ్యాకరణశాస్త్రజ్ఞులు ఈ ముక్కను తీసికెళ్ళి కొన్ని మాటల చివరన ఉండే, తరచూ జారిపోతూ ఉండే. న కారానికి తగిలించారు. ఏ మాట చివరన ఉన్న న కారం జారిపోయినా అర్థం చెడదో అటువంటి నకారం ద్రుతం అని పిలవబడుతుంది.

తెలుగులో పేను అని ఒక మాట ఉంది. పేను అంటే తెలుసు కదా, తలమీదకెక్కి తెగకుడుతుంది, ముఖ్యంగా పాపం ఆడవాళ్ళను. ఈ పేను అనే మాట చివరన ఉన్న న కారంయొక్క స్వరూపం ను అనే అక్షరాన్ని తీసేయటం కుదరదు కదా. పే అంటే పేను అన్న అర్థం రావటం లేదు. పేను అనక తప్పదు. ఈ పేను అన్నదాంట్లో ను అన్నది ద్రుతం (జారిపోయే రకం) కాదన్న మాట. అంటే శబ్దం చివరన ఒక విడదీయరాని భాగంగా ఉన్న నకారం ద్రుతం కాదు.

జనంలో ప్రచారంలోనికి వచ్చిన పద్యం ఒకటుంది. అది తిక్కన గారిదని చెప్పేస్తూ ఉంటారు కూడా.

నీ చేతను నా చేతను
వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్
ధర చేత భార్గవు చేత
నరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్

ఈ పద్యం బోగస్ అని చెప్పటానికి పెద్ద పాండిత్యం అక్కరలేదు. ప్రాస నియమం పాటించలేదు - ఇది తిక్కన గారిదా? మూడో పాదంలో గణదోషం - ఇది తిక్కన పద్యమా?

అదంతా ఇప్పుడు మనకు చర్చనీయాంశం కాదు కాని ఇక్కడ చేతను అన్న మాట చూసారా? ఈ చేతను అన్న మాటలో చివర ఉన్న ను అనే అక్షరం తీసేస్తే అది కాస్తా చేత అన్నట్లు మారుతుంది చేత అన్నా చేతను అన్నా ఒకటే కదా. అంటే ఈ పదం ద్రుతం అన్న మాట. నిజానికి ఇది చేతన్ అన్న పదానికి మరో రూపం.  ఈ చేతన్ అనేది తృతీయావిభక్తి ప్రత్యయం. చాలా విభక్తిప్రత్యయాలు ద్రుతాలే. అదెలాగో ముందుముందు చూస్తాం.

అలాగే వచ్చెన్ లేదా వచ్చెను అన్నా వచ్చె అన్నా అర్థం ఏమీ చెడటం లేదు. ఇలా చివరి న్ లేదా ను అనే దానిని తీసేస్తే అర్థం మారని పదాల్లో ఉన్న న్ లేదా ను అనేదే ద్రుతం అని పిలవబడుతుంది.

ఇంకా సరిగ్గా చెప్పాలంటె ఈ 'ను' అనేది చివరన ఉన్న మాటల్లో, ఆ 'ను' అనేదాన్ని శుబ్బరంగా తీసేయటానికి వీలుంటే అదే ద్రుతం. ఈ ద్రుతంలోని ఉకారం లోపించి అది వ్యంజనంగా (అంటే పొల్లు అక్షరంగా మారుతోంది) అంతే కాని ద్రుతం అంటే పదం చివరన జారిపోవటానికి సిధ్ధంగా ఉండే  'ను' అనే చెప్పుకోవటం ఖచ్చితంగా ఉంటుంది

ద్రుతాంతంబులయిన పదంములు ద్రుతప్రకృతికములు (బాల. సంజ్ఞా. 12)


ప్రథమా కయి పట్టియొక్కేతరములయిన విభక్తులు - ఉత్తమ పురుషైక వచనంబులు - భూతతధ్ధర్మాద్యర్థక ప్రధమపుషైక వచనంబులు - ఆశీర్యాద్యర్థకంబులయిన యెడు, తవర్ణకంబులు- శతృతుమానంతర్య చేదాద్యర్థకంబులు - నేను తాను పదంబులును - వలె ప్రభృతులును ద్రుతప్రఖ్ర్తికంబులు.


నన్నున్, నాచేతన్, నాతోడన్, నాకొఱకున్, నావలనన్, నాకంటెన్, నాకున్, మాలోపలన్, మాయందున్, వత్తున్, వచ్చెదన్, వచ్చెన్, వచ్చున్, వచ్చెడున్, ప్రసన్నులయ్యెడున్, కావుతన్, కొట్టుచున్, కొట్టన్, కొట్టగఁన్, కొట్టుడున్, కొట్టినన్, వలెన్, ఎంతయున్, పోలెన్, అయ్యున్ ఇత్యాదు లూహ్యంబులు.


ఏ పదం చివరననైనా ద్రుతం ఉంటే దాన్ని ద్రుతప్రకృతికం అంటారు. అంత వరకూ సులభంగానే ఉంది. ఆ తరువాత సూరిగారి వృత్తి మాత్రం కొంచెం కొయ్యపాకంగా ఉంది ఈ‌నాటి వారికి కొరుకుడు పడదు. అందు చేత విపులీకరించుకోవలసి ఉంది మనం.

విభక్తులలో చాలా వరకూ ద్రుతాలు. ఈ విషయం చెప్పటానికి ప్రథమా, కయి,పట్టి,యొక్క కాక ఇతరములైన విభక్తులు ద్రుతములు అన్నారు వ్యాకర్త.  విభక్తుల గురించి విపులంగా తత్సమ పరిఛ్ఛేదంలో ఆ సూత్రం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి ద్రుతాలకు సంబంధించిన విషయమే చూదాం.

ప్రథమావిభక్తి:  డు, ము, వులు,
ద్వితీయావిభక్తి: నిన్, నున్, లన్
తృతీయావిభక్తి: చేతన్, చేన్, తోడన్, తోన్
చతుర్థీవిభక్తి:   కొఱకున్, కై
పంచమీవిభక్తి:  వలనన్, కంటెన్, పట్టి
షష్ఠీవిభక్తి:     కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్
సప్తమీవిభక్తి:   అందున్, ఇందున్, నన్ 

పై పట్టికలో ద్రుతప్రకృతులను క్రీగీతతో చూపటం జరిగింది. క్రీగీతలకు నోచుకోనివల్లా  ప్రథమావిభక్తి (డు,ము,వు,లు), కై (కయి) అనే చతుర్థీవిభక్తి ప్రత్యయం,  పట్టి అనే పంచమీవిభక్తి ప్రత్యయమూ, యొక్క అనే షష్ఠీవిభక్తి ప్రత్యయమూ మాత్రమే.

రెండవ రకం ద్రుతాలు సూరిగారు చెప్పిన ఉత్తమపురషైక వచనాలు. ఈ పురుషల గురించి క్రియా పరిఛ్ఛేదంలో వస్తుంది. ప్రస్తుతానికి క్లుప్తంగా చెప్పుకుందాం.

ప్రథమపురుష:  ఎదురుగా లేని ఎవరిగురించో ప్రస్తావించటం. వాడు అని ఏకవచనం, వారు అని బహువచనం
మధ్యమపురుష: ఎదురుగా ఉన్నవారి గురించి ప్రస్తావించటం. నీవు అని ఏకవచనం, మీరు అని బహువచనం.
ఉత్తమపురుష: తన గురించి కాని తమ గురించీ చెప్పుకోవటం. నేను అన్నప్పుడు ఏకవచనం, మేము అన్నప్పుడు బహువచనం.

ఇక్కడ సూరిగారు ఉత్తమపురుషలోని ఏకవచనం గురించి చెప్పారు. అంటే నేను అన్నదాని గురించి అన్నమాట.  నేను అన్న వ్యవహారంతో మనం చెప్పే వాక్యాలలోని క్రియాపదాలు ద్రుతప్రకృతులు. వచ్చెదను అన్నప్పుడు అది తనగురించి చెప్పుకునేది కాబట్టి ఉత్తమపురుష, ఏకవచనమూ కదా. ఈ వచ్చెదను అన్నది ద్రుతం వచ్చెద అని కూడా అనవచ్చును అందు చేత. అలాగే పోదును లేదా పోదు అని కూడా అనవచ్చును.

భూతప్రథమపురుషైకవచనం. ఇలా రాస్తే గాభరాగానే ఉంటుంది నేటి వారికి. కాని సమాసం అంతా మధ్యలో విరామం లేకుండానే వ్రాయటం సంప్రదాయం. సమాసం అంటే  కొన్ని పదాలు కలిసిపోయి ఒకే పదం అని కదా మరి. అందుకన్న మాట. ఇప్పటి వారికోసం భూత ప్రథమ పురుష ఏక వచనం అని విడదీసి వ్రాద్దాం ప్రస్తుతానికి.   ప్రథమపురుషలో ఏకవచనం వాడు అని. వాడు అనే అర్థంలో చెప్పే వాక్యాలలో ఉండే క్రియాపదాలు ద్రుతాలు. ఉదాహరణకు వచ్చెను, పోయెను అనే పదాలు. వీటిలో చివర ను అనేది జారిపోతుంది అవసరం ఐతే. అందుకే అవి ద్రుతాలు.

తధ్ధర్మార్థకప్రథమపురుషైకవచనములు. విడిగా వ్రాస్తే తధ్ధర్మార్థక ప్రథమ పురుష ఏక వచనాలు. తధ్ధర్మార్థకం అంటే అలా చేస్తాడు, ఇలా చేస్తాడు వగైరా పధ్ధతులుగా చెప్పటం. వెళ్ళును అన్నప్పుడు ఎదుటి వాడి గురించి చెప్పినమాట కాబట్టి ప్రథమపురుష. ఫలాని సమయం నిర్దేశించి ఏమీ చెప్పదు కాబట్టి తధ్దర్మార్థకం అన్నమాట. పోవును, చేయును, తినును, చేకొనును వగైరా క్రియాపదాలు. వీటి చివరన ఉన్న ను అనేది ద్రుతం. హాయిగా తీసెయ్యచ్చు అవసరం అనుకుంటే.

ఆశీరాద్యర్థకంబులైన యెడు త వర్ణకంబులు. ఆశీర్వచనము వంటి సందర్భాలలో కొన్ని చోట్ల ఎడు అని త అని కొన్ని వర్ణకములు తగిలిస్తూ ఉంటాము.  ఉదాహరణకు ప్రసన్నులయ్యెడున్ , వచ్చు కావుతన్ వంటి ప్రయోగాలు.

నన్నయ్యగారు మహాభారతం ఆదిపర్వంలో ఉదంకుడి కథలో చెప్పిన ఈ పద్యం చూడండి:

  దేవ మనుష్య లోకముల ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సం
  భావిత శక్తిశౌర్యులు నపార విషోత్కట కోప విస్ఫురత్
  పావక తాపి తాఖిల విపక్షులు నైన మహానుభావు లై
  రావత కోటి ఘోర ఫణిరాజులు మాకు ప్రసన్నులయ్యెడున్

నాగప్రముఖుల్ని తనపట్ల ప్రసన్నం ఐ సహాయం చేయమని ఉదంకుడు ప్రార్థన చేస్తాడు. ఆసందర్భంలోనిది ఈ పద్యం. ఇక్కడ ప్రసన్నులయ్యెడున్ అంటే ప్రసన్నులు అగుదురు కాక అని వాంఛను వ్యక్తం చేయటం.

అలాగే పోతనగారు భాగవతంలో "దిక్కయ్యెడు వాఁడు నాకు దిక్కు మహాత్మా!" అని ప్రహ్లాదుడినోట అయ్యెడు అన్న మాటను ద్రుతం లేకుండా ప్రయోగించారు.

మనుచరిత్రంలో అల్లసాని పెద్దనగారు చెప్పిన పద్యం

ఉల్లమునందు నక్కటికమూనుట మీ కులమందు కంటిమం
చల్లన మేలమాడు అచలాత్మజమాటకు లేతనవ్వు సం
ధిల్ల కిరీటి పాశుపత దివ్యశరాఢ్యుని చేయు శాంబరీ
భిల్లుడు కృష్ణరాయల కభీష్టశుభ ప్రతిపాది కావుతన్‌

శివుడు కృష్ణరాయలకు అభీష్టాలు ఇచ్చుకాక అనిచెప్పటానికి శాంబరీ భిల్లుడు కృష్ణరాయల కభీష్టశుభ ప్రతిపాది కావుతన్‌ అన్నారు. ఈ‌ కావుతన్ అనేది ద్రుతంగా ఇక్కడ ఉన్నా మరొకచోట అవసరం ఐతే కావుత అనవచ్చును.

శత్రర్థకం అన్నది ఒకటుంది. గాభరాపడకండి. ఇదేమీ శత్రువులూ మిత్రులూ అన్న వ్యవహారానికి సంబంధించినది కాదు.  కొన్ని సార్లు క్రియల్ని చివర చున్ అని కలిపి ప్రయోగిస్తాం చూడండి
వచ్చుచున్, పోవుచున్, తినుచున్, కొట్టుచున్, త్రాగుచున్, చేయుచున్ వగైరాలన్నమాట.
వ్యావహారికంలో వీటిని వస్తూ, పోతూ, తింటూ, కొడుతూ, త్రాగుతూ, చేస్తూ అంటూ ఉంటాం. అంటే క్రియకు వర్తమానస్వరూపంగా చెప్పటం అన్నమాట. ఇలాంటి క్రియారూపాలు ద్రుతాలు. అంటే చేయుచున్ అనటం బదులుగా చేయుచు అని కూడా అనవచ్చును.

ఇంక తుమర్థకం లేదా తుమర్థం అని ఒకటుంది.  అంటే ఏ క్రియ కోసమైనా మరొక క్రియ కనుక జరిగితే ఆ క్రియ తుమర్థం లేదా తుమర్థకం అంటారు. సులభంగా చెప్పాలంటే ఏ క్రియ చివరనైనా మనం అన్ అని చేర్చి చెప్పితే అది తుమర్థక్రియ అన్నమాట. ఉదాహరణకు కొట్టగన్ (కొట్తగను), చేయగన్ (చేయగను), పోవన్ (పోవను) అన్నవి. ఈ సందర్భంలో  గ్రంథభాషలో సులభంగా  మనం కొట్టుటకు, చేయుటకు, పోవుటకు, పోవుటకు అని వాడతాము. అలాగే వ్యావహారిక భాషలో వీటినే కొట్టటానికి, చేయటానికి, పోవటానికి అని చెబుతాము.  ఈ పదాల్లో కొట్టగన్, చేయగన్ వంటివాటిలో చివరన ఉన్న నకారం ద్రుతం అన్న మాట చెబుతున్నారు సూరిగారు. అంటే మనం అవసరమైతే కొట్ట, చేయ, పోవ వంటి స్వరూపాల్లోనూ వాడవచ్చును.

ఆనంతర్యార్థకం అని మరొకటి చెప్పారు.  ఫలాని క్రియ జరిగిన తరువాత అని అర్థం వచ్చే క్రియారూపాల్లో ఉండే నకారం కూడా ద్రుతమే అని చెప్పటం ఇక్కడి సంగతి. ఈ రకమైన క్రియారూపాల్లో క్రియ  చివరన డున్ అని వస్తుంది.  ఉదాహరణకు కొట్టుడున్, చేయుడున్, పోవడున్ అన్న విధంగా. వ్యవహారభాషలో మనం కొట్టగా చేయగా వంటి పధ్ధతుల్లో వాడుతాం. ఈ కొట్టుడున్ వగైరా వాటిలో ఉన్న చివరి నకారం ద్రుతం అంటే మనం దాన్ని వదిలి కొట్టుడు అన్న రూపంలో కూడా వాడవచ్చునన్నమాట.

చేదాధ్యర్థకములు అన్నవి కూడా చెప్పారు చివరన వృత్తిలో సూరిగారు.  ఫలాని విధంగా జరిగిన పక్షంలో అన్న అర్థంలో వాడే క్రియారూపాలు ఇవి.  ఉదాహరణకు కొట్టినన్, చేసినన్, పోయినన్, వచ్చినన్ వంటివి. ఉకారం చివరి అచ్చుగా కొట్టినను, పోయినను, చేసినను, వచ్చినను వగైరా విధంగా కూడా అనవచ్చును. వ్యావహారిక భాషలో వీటినే మనం వచ్చినా, కొట్టినా, పోయినా, తినినా, చేసినా అని వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా ద్రుతాలు అంటున్నారు కాబట్టి వీటిలోని చివరి నకారం ఎత్తివేసి వచ్చినను బదులుగా వచ్చిన, కొట్టినను బదులు కొట్టిన అంటూ వాడవచ్చును.

నేను - తాను అనే సర్వనామాలు కూదా ద్రుతాలని చెప్పారు. అంటే నే అని తా అని కూడా కవులు ప్రయోగించటం చూడవచ్చును. ప్రజలూ ప్రయోగిస్తారు నిత్యం. ఉదాహరణకు "నేను పోను" అన్న వాక్యం వినిపించినట్లే, "నే పోను" అన్న వాక్యమూ వినిపిస్తుంది కదా ప్రజల వాడుకలో. అలాగే "తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు" అన్న సామెతను తరచుగా "తా బట్టిన కుందేటికి మూడే‌ కాళ్ళు" అన్న రూపంలో జనం వాడుతూ ఉంటారు కదా.

ఇంకా వలె వగైరా మాటలున్నాయని చెబుతున్నారు. అంటే వలెన్ లేదా వలెను అన్నది ద్రుతం కాబట్టి వలె అని కూడా వాడవచ్చును. ఇటువంటివి కొన్ని చెప్పాలంటే, వలెన్, పోలెన్, అయ్యున్,  ఎంతయున్ అన్నవి.

ఈ విధంగా సూరిగారు ఈ‌ సూత్రంలో ఏఏ రకాలుగా ద్రుతప్రకృతులు ఉంటాయో చెప్పారు.

ద్రుతప్రకృతులు గాని శబ్దంబులు కళలనంబడు (బాల. సంజ్ఞా. 13)

రాముఁడు, రాములు, హయము, విష్ణువు, గోడ, మేడ, అయ్య, అమ్మ, రామునికయి, జ్ఞానముఁబట్టి, నాయొక్క, వచ్చిరి,  వచ్చితివి, వచ్చితిరి, వచ్చితిమి, రాడు, రారు, రాదు, రావు, రాము, కొట్టక, తిట్టక, ఎత్తిలి, ఒత్తిలి, ఊరక, మిన్నక, బళి, అక్కట, ఏల. ఇత్యాదు లూహించునది

ద్రుతప్రకృతికం కాని పదాన్ని కళ అంటారు.

మనం పైన సూత్రాన్ని చెప్పుకుంటున్న సందర్భంలో అనేక విభక్తి ప్రత్యయాలు ద్రుతాలు అని గమనించాం కదా. కాని వాటిలో ప్రథమా విభక్తి ప్రత్యయాలు ద్రుతాలుగా లేవు. అందుకనే డు-ము-వు-లు ఉన్న రాముఁదు,  పాము, హయము, విష్ణువు, రాములు వంటివి ద్రుతాలు కావు కళలే.

అలాగే పట్టి అనే పంచమీ విభక్తి ప్రత్యయం ద్రుతం కాదు కళ. అందుకే జ్ఞానముఁబట్టి వంటివి కళలు. అలాగే యొక్క అనే షష్ఠీవిభక్తి ప్రత్యయమూ కళ కాబట్టి నాయొక్క, వానియొక్క వంటివి కళలు.

వచ్చిరి, వచ్చితివి వచ్చితిరి, వచ్చితిమి అన్నవి భూతకాలంలో ఉన్న క్రియలు. ఇందులో వచ్చితివి మధ్యమపురుష - ఏకవచనం. వచ్చితిమి - ఉత్తమపురుష - బహువచనం. వచ్చిరి, వచ్చితిరి అన్నవి ప్రథమపురుష బహువచనం.  ఇవన్నీ కళలు.

వ్యతిరేకతను తెలిపే క్రియలు కూడా కళలే.  రాడు, రారు, రాదు రావు, పోడు, పోదు వగైరా అన్ని క్రియారూపాలూ కళలు.

క్త్వార్థకం అంటే భూతకాలిక అసమాపక క్రియ.  ఎత్తిలి ఒత్తిలి, తిని, వచ్చి, వెళ్ళి వంటి మాటలని క్త్వార్థకములు అంటారు. ఇవన్నీ కూడా కళలే.

అవ్యయాలు కూడా కళలే.  అవ్యయం అంటే లింగము, వచనము, విభక్తి అనేవాటితో సంబంధం లేకుండా ఒకేలా వాడబడే పదాలు. ఉదాహరణకు భళీ అన్న మాట ఉందనుకోండి. అది స్త్రీ పరంగా చెప్పామా పురుషుణ్ణి ఉద్దేశించి చెప్పామా, ఏదన్నా జరిగిన సంగతిని ఉద్దేశించి చెప్పామా అన్నదానితో సంబంధం లేకుండా వాడతాం. అలాగే జరుగుతున్నదాని గురించి చెప్పామా, జరగబోయేదాని గురించి చెప్పామా అన్నదానితోనూ సంబంధం లేకుండా వాడతాం. అలాగే ఆ పదం వాక్యంలో ఉన్న ఏపదం యెక్క విభక్తికి సంబంధించీ మార్పు లేకుండానే భళీ అనే అంటాం. ఇలాంటి పదాలు అవ్యయాలు అన్నమాట. ఇంకా అక్కట, ఊరక, ఏల వంటివి కూడా భళి లాగే అవ్యయాలే.

ఇప్పుడు చదువరులు సాధనచేయవలసింది ఏమిటంటే పైన ఇచ్చిన సూత్రాల ఆధారంగా మరికొన్ని ద్రుతాలూ కళలూ తెలుగుభాషలో గుర్తించటం. అవెందుకు ద్రుతాలైనదీ కానిదీ గ్రహించటం. గ్రంధభాషపైన పట్టు బాగా రావాలంటే ఈ ద్రుతాలూ‌కళలు అనేవాటిని సుష్టుగా తెలిసి ఉండటం తప్పనిసరి అని గ్రహించాలి అందరూ.  ఉదాహరణకు గ్రంథాల్లో 'వాని నడిగి' వంటి ప్రయోగాలు కనిపించినప్పుడు అక్కడ నడిగి అన్నది నిజానికి అడిగి అనీ వానిన్ అడిగి అని విడదీసుకొని గ్రహించాలనీ తెలియాలి కదా.

గమనిక: ఈ‌ ద్రుతాలూ‌ కళలను గురించి ఇంకా చెప్పుకోవలసినది ఉంది. 

8 కామెంట్‌లు:

  1. సంక్రాంతి శుభకామనలు.
    మొదలెట్టి, సగంలో మిగిలినవి చాలా బాకీ ఉండిపోతిరి గదా! దయలుంచి పూర్తి చేయుడి. ముఖ్యంగా సౌందర్య లహరి.

    రిప్లయితొలగించండి
  2. శ్యామలీయం గారు,

    నా చిన్నప్పటి నుంచి సమాధానం దొరకని ప్రశ్న… మీ వద్ద తప్పకుండా దొరుకుతుందన్న నమ్మకం!

    తెలుగు వ్యాకరణం లో ‘అరసున్న’ కున్న ప్రాముఖ్యత ఏమిటి?
    యేఏ సందర్భాలలో అరసున్న వాడాలి?

    ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఇప్పటి దాకా 'ఆరా' సున్నా పూర్తి ఐనట్టు లేదు !!

      జిలేబి

      తొలగించండి
    2. అరసున్న గురించి వ్రాస్తానండీ. సమయం దొరకటం దుర్ల్భంగా ఉంది, అంతే.

      తొలగించండి
  3. సర్..వివరణ బాగుంది..
    మీ బ్లాగు లో మెంబర్ కావడం ఎలా...

    రిప్లయితొలగించండి
  4. స ష లకు ప్రాస ఘ సందర్భములో చెల్లుతుంది సర్

    రిప్లయితొలగించండి